ఈ-రిక్షా డ్రైవర్స్‌గా రాణిస్తున్న 60 మంది గిరిజన మహిళలు!

Update: 2022-02-21 10:26 GMT

దిశ, ఫీచర్స్: గుజరాత్‌ రాష్ట్రం, నర్మదా జిల్లాలో 'ఐక్యత'కు నిదర్శనంగా నిర్మించిన 'సర్దార్ వల్లభాయ్ పటేల్' అత్యంత ఎత్తైన విగ్రహం ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అంతేకాదు 'మహిళ' ల ఉపాధి, సాధికారత, స్వయం ప్రతిపత్తికి కూడా ఈ టూరిస్ట్ ప్లేస్ ఓ కేంద్రంగా మారింది. ప్రస్తుతం కెవాడియా, ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో 60 మంది మహిళలు ఈ-రిక్షా డ్రైవర్స్‌గా ఉపాధి పొందుతుండటం విశేషం.

గిరిజనుల జీవితాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఆ తెగలోని మహిళలు పొట్టకూటి కోసం నానా కష్టాలు పడుతుంటారు. కెవాడియాలోని గిరిజన మహిళలు కూడా 2021కి ముందు అవమానకర జీవితాల్ని వెల్లదీశారు. కానీ ప్రస్తుతం కొత్త దారిలో సాగుతున్నందున వారి జీవితాలు మారిపోయాయి. దాదాపు 60 మంది మహిళలు ఈ-ఆటో రిక్షా డ్రైవర్లుగా రాణిస్తున్నారు. రైల్వే స్టేషన్ నుంచి 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' వరకు సందర్శకులను తీసుకెళ్తూ రోజుకు రూ.1000 -రూ.1400 వరకు సంపాదిస్తున్నారు. వాహనానికి రోజువారీ అద్దె చెల్లించాక మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఏక్తానగర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో 260కు పైగా గిరిజన మహిళలకు అధికారిక డ్రైవింగ్ శిక్షణ అందించాం. వీళ్లు డ్రైవింగ్‌తో పాటు అక్కడి పర్యాటక ప్రాంతాల గురించిన సమాచారాన్ని ప్రయాణికులకు అందిస్తారు. 2018 నుంచి ఇప్పటివరకు విదేశీయులు సహా దాదాపు 75 లక్షలకు పైగా పర్యాటకులు ఈ స్థలాన్ని సందర్శించారు. వారిలో ఎక్కువ మంది గిరిజన మహిళలు నడిపే ఈ-రిక్షాల్లోనే తమ ప్రయాణాన్ని ఆస్వాదించారు.

- రాహుల్ పటేల్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్వహణ ప్రతినిధి

Tags:    

Similar News