వివాహేతర సంబంధాలకు 'గ్లీడెన్' యాప్.. లక్షల్లో సబ్‌స్కైబర్లు

దిశ, ఫీచర్స్ : ‘వివాహితులు ఇష్టపూర్వకంగా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే నేరం కాదు’ అని సుప్రీం కోర్టు పేర్కొంది..Latest Telugu News

Update: 2022-07-03 02:45 GMT

దిశ, ఫీచర్స్ : 'వివాహితులు ఇష్టపూర్వకంగా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే నేరం కాదు' అని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతేకాదు భార్యను భర్త ఆస్తిగా భావించడమంటే మహిళా హక్కులను కాలరాయడమేనని, అది కాలం చెల్లిన భావనని తన తీర్పులో స్పష్టం చేసింది. అయినా న్యూస్ చానెల్స్‌, పేపర్స్, సోషల్ మీడియాలో నిత్యం 'వివాహేతర సంబంధ' వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. కనీసం రోజుకొక హత్యయినా ఈ కారణంగా జరుగుతున్నదే. అయితే ఇలాంటి చిక్కులేం లేకుండా, ఎవరికీ ఇబ్బంది కలగకుండా డేటింగ్ యాప్ మాదిరే ఎక్స్‌ట్రా-మారిటల్ ఎఫైర్ కోసం 'గ్లీడెన్' పేరుతో ఓ యాప్ ఉంది. నిజానికి 'ఫ్రాన్స్'లో రూపొందిన ఈ యాప్.. ఇండియాలోనే ఎక్కువ పాపులర్ కావడం గమనార్హం. ఇక వరల్డ్‌వైడ్‌గా 9 మిలియన్‌కు పైగా కస్టమర్ బేస్ కలిగివున్న ఈ వివాహేతర డేటింగ్ ప్లాట్‌ఫామ్‌ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం.

ఓ 30 ఏళ్ల మహిళ‌ తన కెరియర్‌తో పాటు కుటుంబ బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తిస్తోంది. ఆమెకు పెళ్లయ్యి అప్పటికే దశాబ్దకాలం గడిచింది. సాధారణంగా ఇలాంటి మహిళలను పరిపూర్ణ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిగా సమాజం లేబుల్ చేస్తుంది. కానీ స్త్రీల కోరికలు, అలవాట్లు, పద్ధతులు సమాజ కోణంలోనే ఉండవన్నది జగమెరిగిన సత్యం. మంచి భార్యగా, గొప్ప తల్లిగా ఉండేందుకు ఆమె నిరంతరం తన ఇష్టాలను నియంత్రించుకుంటూ ఒత్తిడికి లోనుకావచ్చు. కానీ కొందరు మాత్రం ఏదో ఒక దశలో ఆ నిర్బంధం నుంచి బయటపడాలని ఆశపడుతుంటారు. ఈ క్రమంలోనే తనతో ప్రేమగా మాట్లాడే సహచరుడి కోసం చూడవచ్చు లేదా తనను తానుగా గుర్తించే ఓ భాగస్వామి కావాలని కోరుకోవచ్చు. అలా కాకుండా శృంగారాన్ని ఆశించవచ్చు. అలాంటి మహిళలకు 'గ్లీడెన్' యాప్ సరైన ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తోంది. ఇందులో నకిలీ ఖాతాను సృష్టించి లాగిన్ కావచ్చు. నిజానికి మోడరన్ డేటింగ్ యాప్స్‌లో చాలావరకు పురుషులు తమతో పడుకునేందుకు మాత్రమే ఇష్టపడతారనేది మహిళల ఆరోపణ. ఈ విషయంలో గ్లీడెన్ భిన్నంగా ఉంటుంది. యాప్‌లోని పురుషుల్లో చాల మంది తమ వైవాహిక జీవితంలో అసంతృప్తి లేదా ఒంటరితనాన్ని అనుభవిస్తూ స్నేహపూర్వక సహవాసానికై ఎదురుచూస్తున్నవారే.

ఫ్రాన్స్‌ నుంచి దేశదేశాలకు :

2009లో ఫ్రెంచ్ సోదరులు 'గ్లీడెన్‌'ను ప్రారంభించారు. ఈ కంపెనీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సోలెన్ పైలెట్ నేతృత్వంలోని 20 మంది సభ్యులతో కూడిన మహిళా బృందం దీన్ని నిర్వహిస్తోంది. ఇండియాలో 2017లో లాంచ్ అయిన ఈ యాప్ ఐదేళ్లలో 17 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ను పొందగలిగింది. ప్రారంభంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల నుంచే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ నమోదవగా.. ప్రస్తుతం టైర్ II, III పట్టణాల్లోనూ ఎక్కువగానే వినియోగిస్తున్నారు. కాగా భారతీయులు యూరోపియన్ల కంటే కొంచెం ఎక్కువసేపు చాట్‌లో ఉంటారని, రోజుకు సగటున 3.5 గంటలు యాప్‌లోనే గడుపుతుంటారని, ఇక వారాంతంలో అయితే మరింత ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారని గ్లీడెన్ పేర్కొంది. అయితే పీక్ అవర్స్(రాత్రి 10-12 గంటల) మాత్రం వారం మొత్తంలో స్థిరంగా ఉంటాయని వెల్లడించిన గ్లీడెన్.. యాప్‌లో పురుషులు, మహిళల నిష్పత్తి 60:40గా ఉంటుందని వెల్లడించింది. అంతేకాదు గ్లీడెన్ ద్వారా స్వలింగ సంపర్కుల కోసం వెతుకుతున్న యూజర్ల సంఖ్య 45 శాతానికి పైగా పెరిగింది. ఇక ఈ యాప్ 159 దేశాల్లో సేవలందిస్తుండగా.. గ్లీడెన్ కమ్యూనిటీ అన్ని సంబంధాలకు(వివాహం, విడిపోయిన, విడాకులు తీసుకున్న, సహ-నివాసం, ఒంటరి), లైంగిక ధోరణుల(భిన్న లింగ, ద్విలింగ, స్వలింగ సంపర్కులు)కు అందుబాటులో ఉంటుంది.

సాంప్రదాయ డేటింగ్ యాప్ కాదు:

యాప్ మహిళలకు పూర్తిగా ఉచితం. కానీ పురుషులు మాత్రం సబ్‌స్క్రిప్షన్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 25 క్రెడిట్స్‌కు రూ.1,000, 100 క్రెడిట్స్‌కు రూ.3,000, 400 క్రెడిట్స్‌కు రూ.7,000 మధ్య ఏదైనా చెల్లించవచ్చు. చాటింగ్ ప్రారంభించేందుకు లేదా వర్చువల్ గిఫ్ట్స్ పంపేందుకు యూజర్స్ తమ క్రెడిట్స్ ఉపయోగించవచ్చు. అయితే తమతో నిజంగా మహిళనే చాట్ చేస్తోందా లేదా పురుషుడే పేరు మార్చుకుని చాట్ చేస్తున్నాడా? చెక్ చేసేందుకు 24x7 సర్వీస్ అందించే మోడరేషన్ బృందం సాయం తీసుకోవచ్చు. ఒకవేళ గుర్తింపు నకిలీ అయితే ఆ వ్యక్తిని నిషేధిస్తారు. ప్రతి నివేదికను పరిశోధించడం సహా అశ్లీల లేదా నగ్న చిత్రాలు అనుమతించరు. గ్లీడెన్‌లో నమోదు చేసుకోవడం సులభమే కానీ ఐడెంటిఫైయర్‌గా మారు పేరు పెట్టుకోవాలి. ప్రొఫైల్ చిత్రం తప్పనిసరి కాదు. ఇది వివాహేతర ఎన్‌కౌంటర్ల కోసం కూడిన యాప్ కాబట్టి మీరు మీ దగ్గరలోఉన్న సూటర్లను లేదా సమీప పట్టణంలో లేదా మరెక్కడైనా వెతకవచ్చు.

సంబంధానికి వెలుపల సహచరుల కోసం..

భారత్‌లో యాప్‌ ప్రారంభించినప్పుడు చాలా ఆర్గానిక్ ట్రాఫిక్‌ గమనించాం. 2018లో వ్యభిచారం నేరరహితం అయినప్పుడు యాప్‌లో యూజర్ల పెరుగుదల చూశాం. అయినా ఇప్పటికీ 'సాంప్రదాయ' సమాజంగా పరిగణించబడుతున్న ఇండియా వివాహేతర సంబంధాలను తిరస్కరించవచ్చు. అందులో తప్పేం లేదు. అయితే ఇక్కడి ప్రజలు యంగ్ ఏజ్‌లో పెళ్లి చేసుకుంటారు. బహుశా పదేళ్ల తర్వాత వారు కలిసి ఉన్నప్పటికీ ప్రత్యేక మార్గంలో వెళ్లడం ప్రారంభిస్తారు. వాస్తవానికి కుటుంబ కారణాల వల్ల లేదా విడాకులు ఖరీదైనవి కావడం లేదా విడిపోవడం మానసికంగా భారీ నష్టాన్ని కలిగించవచ్చు. కుటుంబం లేదా సమాజం నుంచి కూడా ఒత్తిడి ఉండవచ్చు. దీంతో వారి సంబంధానికి వెలుపల సహచరుల కోసం చూస్తుంటారు. ఇలాంటి వ్యక్తులకు గ్లీడెన్ సహకరిస్తుంది. ప్రైవేట్ వాతావరణంలో అవసరమైన సేవలందిస్తుంది. ఇది కూడా సురక్షితమైందే. మా ప్లాట్‌ఫామ్‌లో మహిళలు వేధింపులకు గురికావడం ఇష్టం లేదు. నిర్దిష్ట వినియోగదారుకు వ్యతిరేకంగా ఫిర్యాదులు అందినవారి ప్రొఫైల్స్‌ను బ్లాక్‌లిస్ట్ చేస్తాం. వాస్తవానికి మా యాప్‌లో ప్రేమలో పడటమే కాకుండా పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు వేరొకరిలా నటించాల్సిన అవసరం లేదు. మీరు వివాహం చేసుకున్నారని లేదా సంబంధంలో ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మీపై తీర్పు చెప్పే స్థలం కాదు.

- సిబిల్ షిడెల్, మేనేజర్


Similar News