కేఆర్ జనశక్తికి పునరుజ్జీవం పోస్తున్నారా..?
దశాబ్దన్నర కాలం తరువాత ఆయన మళ్లీ సాయుధ దళాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నం అయ్యారా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: దశాబ్దన్నర కాలం తరువాత ఆయన మళ్లీ సాయుధ దళాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నం అయ్యారా..? యూజీ క్యాడర్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారా..? తన చేతిలో నిర్మాణం అయిన జనశక్తికి పునరుజ్జీవం నింపే పనిలో పడ్డారా..? ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ. విప్లవ పంథాలో దశాబ్దాల పాటు ముందుకు సాగిన ఉస్మానియా ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ చేసిన కూర రాజన్న అలియాస్ కేఆర్ పేరు తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.
పునర్నిమాణంపై నజర్...?
దాదాపు దశాబ్దన్నర కాలం క్రితం పార్టీ ఉత్తర తెలంగాణలోని సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి ప్రాంతాల్లో సాయుధ పోరుబాట కొనసాగించింది. 2004లో ఉత్తర ప్రదేశ్ లోని బారాబంకిలో అరెస్ట్ అయిన కూర రాజన్న అప్పటి నుండి జనజీవనంలోనే కొనసాగుతున్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో రణధీర్ నేతృత్వంలో 46 మంది సాయుధులు లొంగిపోయారు. ఆ తరువాత కేఆర్ సోదరుడు కూర దేవేందర్ అలియాస్ కె.డి. మహారాష్ట్రాలోని పూణేలో అరెస్ట్ అయ్యారు. దీంతో జనశక్తి పార్టీ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిందని చెప్పాలి. ఆ తరువాత పార్టీని పునర్నిమించేందుకు కమిటీలను వేసినా పోలీసులు వారిని అరెస్ట్ చేయడమో లేక ఎన్ కౌంటర్‌లో మట్టుబెట్టడమో చేశారు. దీంతో జనశక్తి గత వైభవాన్ని సంతరించుకునే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా గత నెలలో సిరిసిల్ల ప్రాంతంలో జనశక్తి ప్లీనరీ చేపట్టిందన్న ప్రచారం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మొదట సిరిసిల్ల పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుండి భారీగా ఆయుధాలు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
కన్ఫెషన్ తో వెలుగులోకి
కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేసిన జనశక్తి కీలక నాయకుల కన్ఫెషన్ రిపోర్టుతో కేఆర్ మళ్లీ పార్టీ కార్యకలాపాలను కొనసాగించే పనిలో నిమగ్నం అయినట్టు స్పష్టం అవుతోంది. చెట్టి రాజేశ్వర్ ద్వారా పీఎస్‌పీ రెడ్డి కూర రాజన్నను కలిసినప్పుడు అతనికి ఆరు షార్ట్ వెపన్స్‌తో పాటు భారీ మొత్తంలో ఆయుధ సామగ్రిని అప్పగించినట్టు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. దాదాపు 17 ఏళ్ల తరువాత కూర రాజన్న పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారని పోలీసుల ప్రకటనతో స్పష్టం అవుతోంది.
పుట్టిన పార్టీకి పునరుజ్జీవమా..?
1990వ దశాబ్దాంలో పీపుల్స్ వార్ నుండి బయటకు వచ్చి జనశక్తి పేరిట కొత్త విప్లవ పార్టీని కూర రాజన్న స్థాపించారు. 2005-06 వరకు కూడా సిరిసిల్ల, జగిత్యాల, కామరెడ్డి ప్రాంతాల్లో తిరుగులేని పట్టు సాధించింది. ఆ తరువాత నిర్భందాలు ఎక్కువ కావడం, పార్టీ కేడర్ చేజారి పోయి జనజీవనంలో కలవడంతో ఉనికే లేకుండా పోయింది. 2004లో రాజన్న అరెస్ట్ తరువాతే జనశక్తి పతనం దిశగా అడుగులు వేసింది. అయితే తన చేతిలో పుట్టిన పార్టీకి పునరుజ్జీవం తీసుకురావాలన్న సంకల్పంతో ఉన్నారని పోలీసుల విచారణలో తేటతెల్లం అవుతోంది. అయితే ఏడు పదులు వయసులో ఉన్న కేఆర్ ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. పోలీసుల విచారణ ప్రకారం అయితే కేఆర్ అదే పనిలో ఉన్నారని తేట్టతెల్లం అవుతోంది. ఈ వయసులో ఆయనకు ఆరోగ్యం సహకరిస్తోందా, సాంకేతికతను అందిపుచ్చుకుని పోలీసులు విప్లవ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న ఈ సమయంలో జనశక్తి పునర్నిమాణానికి సాహసిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.