ఆ సారు పాఠశాల కెందుకు రారు..?

దిశ, అశ్వాపురం : రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఓ పక్క ప్రభుత్వ

Update: 2022-03-07 02:35 GMT

దిశ, అశ్వాపురం : రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఓ పక్క ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ఏర్పాటు చేస్తుంది. కానీ పిల్లలకు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరవడమేకాక దర్జాగా జీతం తీసుకుంటూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థుల భవిష్యత్ ను ప్రశ్నార్ధకంగా మార్చడమే కాక, అట్టి ఉపాధ్యాయుడి ప్రవర్తన తమ పిల్లల భవిష్యత్తు కు శాపంగా మారిందని.. ఆ ఉపాధ్యాయునిపై చర్యలు చేపట్టాలని.. తన పర్యటనలో భాగంగా అటుగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యేకి గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కోరడంతో వెంటనే ఎమ్మెల్యే ఆ పాఠశాలను తనిఖీ చేయడంతో అసలు వాస్తవాలు వెల్లడయ్యాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామవరం గ్రామంలో ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యులు రేగా కాంతారావు శనివారం పర్యటించారు. ఆ గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు ఎమ్మెల్యే ని కలిసి, వారి గ్రామంలోని పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏ మాత్రం విద్యాబుద్ధులు రావట్లేవని అందుకు కారణం ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల ప్రవర్తనే అంటూ ఎమ్మెల్యేకి వివరించారు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఎమ్మెల్యే రేగా కాంతారావు పాఠశాలను తనిఖీ చేయగా ఆ సమయంలో పాఠశాలలో ఒక్క ఉపాద్యాయుడు సైతం లేకపోవడంతో విద్యార్థులు ఇష్టం వచ్చినట్లు ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి బడిలో ఉపాధ్యాయులు ఎందుకు లేరు.. ?? మీరేం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఓ ఉపాధ్యాయుడు ఐటిడిఎ వారు నిర్వహించే శిక్షణ తరగతులకు వెళ్లాడని, మరో ఉపాధ్యాయుడికి ఎటువంటి సెలవు మంజూరు చేయలేదని వారు తెలిపారు. పాఠశాలల్లోని విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడగా.. విద్యార్థులకు కనీస పరిజ్ఞానం లేదని గుర్తించిన ఎమ్మెల్యే వారి తల్లి దండ్రులని పిలిపించి మాట్లాడారు. ఇక్కడి ఉపాధ్యాయుడి వల్లనే మా పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని, అట్టి ఉపాధ్యాయుడు సరిగా పాఠశాలకు రాడని, వచ్చినా పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతాడని.. ఉద్యోగం విషయంలో ఆయన బాధ్యతా రహితంగా వ్యవహరిస్తూ సొంత వ్యాపారాలు చేసుకుంటాడని.. వారి వల్ల మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాఠశాల రికార్డులను తనిఖీ చేసి వాటిని తన వెంట తీసుకెళ్లారు.

అసలు ఏం జరుగుతుంది..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామవరం గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు SGT గా పనిచేస్తున్నారు. అందులో ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు తరచూ గైర్ హాజరవుతారని, అతని తల్లి పేరిట అశ్వాపురం లో ఫెర్టిలైజర్స్ దుకాణం ఉన్నదని, గొండిగూడెం, తుమ్మలచెరువు ప్రాంతములో అమాయకపు గిరిజన రైతుల పేదరికాన్ని ఆసరాగా తీసుకుని వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టి పంట సమయంలో తనకు పంటను అమ్మాలని సూచించి పెద్ద ఎత్తున దందా చేస్తున్నాడని, బినామీ పేర్లతో భూములు అక్రమంగా పొందాడని, ఒకటేమిటి పురుగుమందులు, చిట్టీలు, వడ్డీలు, చేపల చెరువులు వంటి వ్యాపారలెన్నో చేస్తుంటాడని, ఉపాధ్యాయ ఉద్యోగం ఆయనకు అలంకార ప్రయమేనని బహిరంగంగా విమర్శలున్నాయి.

అతడిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ళను ఏమైనా అంటాడేమోనని, మరల పెట్టుబడికి డబ్బులివ్వడేమోనని గిరిజనులంతా భయపడుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ఆయన వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుందని పలుకుబడితో ఆయన గతంలో SCRP (స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్) గా విధులు నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ గా పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పాఠశాలలను తనిఖీ చేస్తే చాలు కాబట్టి ఆయన పలుకుబడితో అట్టి విధుల్లో చేరాడని 5 యేండ్లు పనిచేశాడని, ఈ ఏడాది ఐటిడిఎ పిఓ SCRP గా కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో ఆ ఉపాధ్యాయుడు మరల పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినట్లు బహిరంగ విమర్శలున్నాయి.

మెడికల్ లీవ్ లో ఉంటే సారుకు జీత మెట్ల వచ్చే..

ఆ ఉపాధ్యాయుడు, ఫిబ్రవరి 1వ తేదీ నుండి 28 వ తేదీ వరకు మెడికల్ లీవ్ లో ఉన్నాడని, మార్చి 1 నుంచి ఆయనకు ఎటువంటి లీవ్ మంజూరు చేయలేదని గొండిగూడెం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. రామారావు దిశ పత్రికా విలేఖరికి వివరించారు. అయితే మెడికల్ లీవ్ తీసుకునే ఉద్యోగి సంబంధిత పై అధికారికి మెడికల్ ఆఫీసర్ సర్టిఫై చేసిన A ఫారం ని సమర్పించి లీవ్ పొందాల్సి ఉంది. ఆ తర్వాత మళ్లీ విధుల్లో చేరేప్పుడు B ఫారం సమర్పించాలి. కానీ ఆ సారు ఎటువంటి ఫారం సమర్పించలేదని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.

ఇదిలా ఉండగా ఫిబ్రవరి 28న ఆయన లీవ్ పూర్తయిన తర్వాత మార్చి 1 న పబ్లిక్ హాలిడే పూర్తిచేసుకొని 2 వ తేదీ మెడికల్ లీవ్ పెంచాలని కోరారని, మెడికల్ లీవ్ పొడిగించడం కుదరదని నిరాకరించినట్లు వారు పేర్కొన్నారు. మరి ఆ ఉపాధ్యాయుడికి లీవ్ మంజూరు కానట్లయితే ఆయన విధులకు ఎందుకు హాజరు కానట్లు.. ? ఆయన బడికి రావట్లేదని స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ వెంకన్న ప్రధానోపాధ్యాయులు ఎల్. రామారావుకి రిపోర్ట్ చేసినా సరే ప్రధానోపాధ్యాయులు ఎందుకు పట్టించుకోలేదు?? తిరిగి విధుల్లో చేరకుండా AB ఫారం సమర్పిచకుండానే ఆ ఉపాధ్యాయుడికి అందరిలాగానే ఫిబ్రవరి నెల పూర్తి జీతం ఎందుకు వచ్చింది?? అసలు ఫిబ్రవరి నెల జీతం రావాలంటే ప్రధానోపాధ్యాయుడు రామారావు ఫిబ్రవరి నెలాఖరున జీతాల బిల్లును ఎస్టీఓకి పంపించారు.

అందులో ఆ ఉపాధ్యాయుడికి మెడికల్ లీవ్ లో ఉన్న సరే ఎస్ఆర్ పుస్తకంలో ఎంటర్ చేయకుండా, AB ఫారం ఇవ్వకుండా ఆయనకు ఫిబ్రవరి నెల జీతం ఎందుకు చేశారు?? అందులో ఆంతర్యమేంటి అనే విషయంలో తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఈ తతంగం ఎప్పటి నుంచి జరుగుతుంది. ఎంతమంది అధికారులు దీనికి సహకరిస్తున్నారు. అమాయకపు గిరిజన విద్యార్థులకు విద్య బుద్దులు నేర్పించకుండా, విధులకు హాజరు కాకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పైగా జీతం ఎలా తీసుకున్నారంటూ.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్లు ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుల పట్ల ఐటిడిఎ ఉన్నతాధికారులు పూర్తి విచారణ జరిపి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఓ లోతుగా విచారించి ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News