'బీహార్'​ను చూసి నేర్చుకో.. టీ సర్కార్​పై ఎన్ఎంసీ సీరియస్​

దిశ, తెలంగాణ బ్యూరో : మెడికల్​ కాలేజీల రద్దు అంశంలో నేషనల్ ​మెడికల్ ​కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్​ అయింది.

Update: 2022-07-04 18:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మెడికల్​ కాలేజీల రద్దు అంశంలో నేషనల్ ​మెడికల్ ​కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్​ అయింది. కాలేజీల పర్మిషన్లు క్యాన్సలై 45 రోజులైనా సీట్ల సర్దుబాటు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్ధులు భవిష్యత్​పై బాధ్యత లేదా అంటూ ప్రశ్నించింది. బీహార్​ను చూసి నేర్చుకోవాలని హితవు పలికింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ఎన్ఎంసీ రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా బీహర్​లో పర్మిషన్లు రద్దైన కాలేజీలు తయారు చేసిన విధానాన్ని లేఖకు జత చేయడం గమనార్హం. దీంతో ప్రభుత్వం అసలు రంగు బయట పడింది. ఇప్పటికే తాము ప్రపోజల్​ పంపించామని మంత్రి, ఆఫీసర్లు చేసిన ప్రచారంలో వాస్తవం లేదని బట్టబయలైనది. దీంతో విద్యార్ధుల్లో ఆగ్రహం పెరిగింది.

సర్కార్​ గేమ్​....

వైద్య విద్యార్థుల జీవితాలతో కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం, రాష్ట్ర వైద్యశాఖ ఆడుకుంటున్నాయి. వీళ్ల నిర్లక్ష్యంతో 550 మంది ఎంబీబీఎస్, ఎండీ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సీట్ల రద్దైన స్టూడెంట్లను రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో చేర్చుకుని సర్దుబాటు చేయాలని 'నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌'(ఎన్‌ఎంసీ) నేరుగా హైకోర్టులో రాతపూర్వకంగా అఫిడవిట్‌ దాఖలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ,కాళోజీ వర్శిటీ గానీ పట్టించుకోవడం లేదు. వర్శిటీ నిర్లక్ష్యంతో వైద్య విద్యార్థులు రోడ్డునపడ్డారు. విద్యార్ధుల చదువులు కొనసాగుతాయా లేదా అనేది ఎవరూ చెప్పడం లేదు. కాళోజీ వర్శిటీకి వెళ్లి ఉపకులపతి(వీసీ) ఛాంబర్‌ ముందు రోజుల పాటు నిరవధిక ధర్నా చేసి వీసీ కనీసం పట్టించుకోకుండా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుగుణంగా మాట్లాడి తమను ఈసడించుకున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎంఎన్​ఆర్​ కాలేజీ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టిన ఎన్​ఎంసీ ఆప్పీల్​ ను రద్దు చేసింది. దీంతో ఆ కాలేజీల విద్యార్ధులు ఆందోళనలో ఉన్నారు.

ఇదీ జరిగింది...?

సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్, పటాన్‌చెరులోని టీఆర్‌ఆర్, వికారాబాద్‌లోని మహావీర్‌ మెడికల్‌ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, ఎండీ కోర్సుల ప్రవేశాలను రద్దు చేస్తూ 2022 మే19న ఎన్‌ఎంసీ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల జారీ తీరులో కమిషన్‌ విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించకుండా గుడ్డిగా జారీచేసి తప్పు చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు గత 2022 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకూ పలు దఫాలుగా కౌన్సిలింగ్‌ లు జరిగాయి. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ అనుమతి ఉన్న కాలేజీల్లో సీట్ల భర్తీకే కౌన్సిలింగ్‌ నిర్వహించడంతో నీట్‌ ర్యాంకుల ఆధారంగా ఈ 3 కాలేజీల్లో 466 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌లో, మరో 84 మంది ఎండీ(పీజీ) మెడికల్‌ కోర్సుల్లో చేరారు. టీఆర్‌ఆర్‌ తప్ప మిగతా రెండు కాలేజీల్లోనే పీజీ కోర్సుల్లో 84 మంది చేరారు.

తీరా కౌన్సిలింగ్‌ ప్రక్రియ మొత్తం పూర్తయి రెండు నెలల పాటు తరగతులు జరిగాక ఈ 3 కాలేజీల్లో సదుపాయాలు లేవని అనుమతి రద్దు చేస్తున్నట్లు 2022 మే 19న ఎంఎన్‌సీ ఆదేశాలివ్వడం వివాదాస్పదంగా మారింది. తమ భవిష్యత్తు అంధకారంగా మారిందని, తమను ఆదుకోవాలని ఇతర కాలేజీల్లో చేర్చుకోమంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎంఎన్‌ఆర్‌ కాలేజీ వైద్య విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు నోటీసు జారీచేయడంతో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ తాజాగా హైకోర్టులో ఈ విద్యార్థుల సర్దుబాటు గురించి వివరంగా అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో చేర్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని ఈ మేరకు కాళోజీ వర్శిటీ వెంటనే చర్యలు తీసుకోవాలని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. అయినా కాళోజీ వర్శిటీ గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇంతవరకూ స్పందించలేదని విద్యార్థులు ప్రతీ రోజూ నిరసన తెలుపుతున్నారు.

Tags:    

Similar News