బంగారు భవిష్యత్ కావాలా ? అయితే మా పార్టీలో చేరండి!

బంగారు భవిష్యత్తు కావాలంటే యువతీ, యువకులు ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరి, పని చేయాలని ఆప్‌ సెర్చ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ఇందిరాశోభన్‌ పిలుపునిచ్చారు.

Update: 2022-04-04 12:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బంగారు భవిష్యత్తు కావాలంటే యువతీ, యువకులు ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరి, పని చేయాలని ఆప్‌ సెర్చ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ఇందిరాశోభన్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ, విశ్రాంత పారామిలిటరీ సంక్షేమ కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గోర శ్యామ్‌ సుందర్‌ గౌడ్‌, పారామిలిటరీ రిటైర్డ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సైదులు గౌడ్‌ ఆధ్వర్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం లిబర్టీలోని పార్టీ కార్యాలయంలో ఆప్‌ సెర్చ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ఇందిరాశోభన్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్రాంత పారామిలిటరీ ఉద్యోగులు, తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఆప్‌లో చేరడం సంతోషకరమని అన్నారు. సామాన్యుడి చేతికి అధికారం అన్న నినాదంతో ఉద్యమ రూపంలో పోరాటం మొదలు పెట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ డెవలప్‌మెంట్‌ మోడల్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశ రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత వైద్యం, ఉచిత విద్యను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పిన ఆప్ పారదర్శక పాలనతో చరిత్ర సృష్టించిందన్నారు. తెలంగాణలో రాజకీయాలను డబ్బు, అవినీతి మయం చేసిన పార్టీలకు స్వచ్ఛమైన, పారదర్శక పాలనను అందిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ మింగుడుపడటం లేదన్నారు.

కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సహజ వనరులు తరిగిపోతున్నాయని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో 69 వేల కోట్ల రూపాయల అప్పు ఉండేదని, ఇప్పుడు 4 లక్షల కోట్లకు చేరిందన్నారు. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన ప్రత్యేక రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

Tags:    

Similar News