భారత్‌లో రూ. 62,476 కోట్లు పన్నులు ఎగ్గొట్టిన వీవో.!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వీవో ఆర్థిక నేరాలు బయటపడుతున్నాయి.
న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వీవో ఆర్థిక నేరాలు బయటపడుతున్నాయి. ఇటీవల పన్ను ఎగవేత ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వీవో ఇండియా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 48 ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. కంపెనీ మొత్తం టర్నోవర్‌లో సుమారు 50 శాతం వరకు చైనాకు తరలిపోయిందని, దాని విలువ రూ. 62,476 కోట్లుగా గుర్తించామని ఈడీ వెల్లడించింది.
భారత్‌లో పన్నులను ఎగవేసేందుకు వీవో కంపెనీ ఈ మోసానికి పాల్పడిందని పేర్కొంది. దేశీయంగా పన్నులు చెల్లించకుండా నష్టాలను వెల్లడిస్తున్నట్టు కంపెనీ మీద ఆరోపణలు ఉన్నాయి. దీంతో రూ. 66 కోట్ల విలువ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు 119 బ్యాంకు ఖాతాల్లో వీవో కంపెనీకి చెందిన మొత్తం రూ. 465 కోట్ల నిధులను సీజ్ చేసినట్టు, మరో 73 లక్షల నగదుతో పాటు 2 కిలోల బంగారు కడ్డీలను సీజ్ చేసినట్టు ఈడీ వివరించింది. వీవో కంపెనీ మాజీ డైరెక్టర్ పలు కంపెనీలను విలీనం చేసిన తర్వాత 2018లో భారత్ నుంచి వెళ్లినట్టు ఈడీ తెలిపింది.
ఈ కంపెనీలన్నీ దర్యాప్తు పరిధిలో ఉన్నట్టు పేర్కొంది. అలాగే, ఈ నెల 5న జరిగిన సోదాల తర్వాత వీవోకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు చైనాకు వెళ్లిపోయినట్టు వార్తలు వచ్చినప్పటికీ, వీరు గతేడాదిలోనే భారత్‌ను వీడినట్టు తెలుస్తోందని ఈడీ అధికారి చెప్పారు. సోదాలకు సంబంధించి సంస్థలో ఉన్న చైనా ఉద్యోగులు సహకరించడంలేదని, డిజిటల్ సామగ్రిని దాచిపెట్టడం, సమాచారాన్ని తొలగించడం వంటి పను చేశాయని ఈడీ ఆరోపించింది. కాగా, చైనాకు చెందిన కంపెనీల్లో సోదాలు నిర్వహించడం పట్ల స్పందించింది. తమ కంపెనీలనే లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేయడం వల్ల భారత్‌పై పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతింటుందని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై మాట్లాడిన భారత విదేశాంగ శాఖ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలేవైనా ఇక్కడి చట్టాలకు లోబడి పనిచేయాలని వెల్లడించింది.