జగన్ పాలనలో ఆడ బిడ్డలంతా వంచనకు గురయ్యారు: వంగలపూడి అనిత

Update: 2022-02-23 11:35 GMT

దిశ, ఏపీ బ్యూరో: 'మూడేళ్ల జగన్ పాలనలో ఆడ బిడ్డలంతా వంచనకు గురయ్యారు. వైఎస్ జగన్ తన పాలనకు నయవంచన ప్లస్ నమ్మకద్రోహం అనే సరికొత్త నిర్వచనం ఇచ్చారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మహిళలను వంచించడమే జగన్ పనిగా పెట్టుకున్నారు. తన తల్లి, చెల్లీ ఉదంతమే అందుకు నిదర్శనం' అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల తలలు, బుగ్గలు నిమిరిన జగన్ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని నయవంచనకు పాల్పడుతున్నారు అంటూ ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జగన్ రెడ్డి కి పాలాభిషేకం, పూలాభిషేకం చేయడం వంటివి చేశారని ఇప్పుడు అవన్నీ అయిపోయాయని రాళ్లతో అభిషేకం చేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. మహిళలైతే బడితెపూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారని వంగలపూడి అనిత హెచ్చరించారు.

జగన్ రెడ్డి పతనం ప్రారంభమైంది..

'తనతొత్తులుగా ఉన్నపోలీసులతో చంటిబిడ్డలకు అన్నం పెట్టే అంగన్ వాడీలను కూడా అరెస్ట్ లు చేయించడం చూస్తేనే జగన్ రెడ్డి నయవంచన ఏంటో అర్థమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్ వాడీ సిబ్బంది తలలు, బుగ్గలు నిమిరిన జగన్ నేడు వారిని నమ్మించి మోసం చేశారు. జగన్ మోసపు మాటలు నమ్మి, తమ జీతాలు పెంచుతాడని భావించి ఓట్లేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచకపోవడం తో ధర్నాలకు దిగితే పోలీస్ దెబ్బలు రుచిచూపించాడు' అని వంగలపూడి అనిత ధ్వజమెత్తారు.

చంద్రబాబు హయాంలో అంగన్ వాడీలు, ఆశా వర్కర్లకు జీతాలు పెంచితే దాన్ని వైసీపీ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు అని వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ రెడ్డి రాను రాను తుగ్లక్ రెడ్డిగా మారిపోయారంటూ మండిపడ్డారు. అంగన్ వాడీ సిబ్బంది ప్రభుత్వ తీరును, జగన్ దుర్మార్గపు వైఖరిని నిరసిస్తూ రోడ్లెక్కి ధర్నా చేస్తే.. అందుకు ప్రాయశ్చిత్తంగా తన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోందని వంగలపూడి అనిత అన్నారు. జగన్ రెడ్డి కి పాలాభిషేకం, పూలాభిషేకం చేయడం వంటివి అయిపోయాయి.

ఆయన ఒక్క సారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే రాళ్లతో అభిషేకం చేయడానికి ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇంకాస్త ముందుకొచ్చి మహిళలైతే బడితెపూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలు కన్నీళ్లు పెట్టినప్పుడే జగన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. అమరావతి మహిళల్ని పోలీసుల బూటు కాళ్లతో తన్నించినప్పుడే జగన్ పతనం ప్రారంభమైంది. అమరావతి మహిళల్ని, అంగన్ వాడీ సిబ్బందిని, ఆశా వర్కర్లను ఇలా అందరినీ రోడ్లపైకి తీసుకొచ్చి హింసిస్తున్న జగన్ నయవంచకుడు కాదా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు.

మహిళలపై లాఠీ ప్రయోగిస్తే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తాం..

అంగన్ వాడీ సిబ్బంది ఎందుకు రోడ్లపైకి వచ్చారో, ఎందుకు ధర్నాలు చేస్తున్నారో తెలుసుకోకుండా ప్రభుత్వంలోని మహిళా మంత్రులు నిస్సిగ్గుగా జగన్ రెడ్డి భజనచేయడం దురదృష్టకరం. అసలు కేబినెట్ లో మహిళామంత్రులు ఉన్నారనే వాస్తవాన్ని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. అంగన్‌వాడీల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు కాబట్టే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.26 వేలు ఇస్తానని చెప్పి, కేవలం రూ.11,500లు మాత్రమే ఇస్తున్న జగన్ రెడ్డి, అంగన్ వాడీ సిబ్బందితో గొడ్డు చాకిరీ చేయిస్తున్నాడు.

పెరిగినధరలు, ఇతరత్రాపన్నులు చెల్లిస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంగన్ వాడీలు రూ.11వేలతో కుటుంబాలను పోషించుకోగలరా? ఆ విషయం ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచించడు? తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఏంచేస్తున్నాడో తెలియకుండా పోలీసులతో లాఠీఛార్జ్ లుచేయిస్తూ, గృహనిర్బంధాలు చేయిస్తూ జగన్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నాడు. ఇకపై ఈ వర్గంలోని మహిళలకు ముఖ్యమంత్రి అన్యాయం చేసినా, వారిపై పోలీసులను ప్రయోగించినా, ఆయన తాడేపల్లి ఇంటినే ముట్టడిస్తాం అని వంగలపూడి అనిత హెచ్చరించారు.

జగన్ రెడ్డి కి భజన చేసే వారైనా, ఆయనకు అర్థమయ్యేలా వాస్తవాలు చెప్తే మంచిది. జగన్ రెడ్డి ప్రభుత్వం లో వంచనకు గురైన అన్ని వర్గాల మహిళలకు, రేపు చంద్రబాబు అధికారంలోకి రాగానే న్యాయం చేస్తారని వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.

Tags:    

Similar News