సెల్యులాయిడ్ మాస్టర్ పీస్ 'వాళై' (Vaazhai)

బాల్యంలోని విషాదం ఎప్పటికీ ఘనీభవించదు. ఆ గాయం పొడుస్తూనే ఉంటుంది.

Update: 2024-10-18 17:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : బాల్యంలోని విషాదం ఎప్పటికీ ఘనీభవించదు. ఆ గాయం పొడుస్తూనే ఉంటుంది. బయటకు అంతా మామూలుగా అనిపించినా ఆ గాయం చేసే చిత్రవధ సామాన్యమైనది కాదు. 'Like Mango Hairs Between the Molars' (పళ్ళల్లో ఇరుక్కున్న మామిడి పండు నార లాగా) అంటుంది అరుంధతి రాయ్.. సంవత్సరాలుగా గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం ఒక్క ఉదుటున బయటకు వస్తే 'వాళై' (అరటి) లాంటి సినిమా అవుతుంది. అరుంధతి రాయ్ ' గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ' అవుతుంది..

.........................

బాల్యంలో మారీ సెల్వరాజ్ జీవితంలో జరిగిన ఒక ఘోర దుర్ఘటన ఈ సినిమాకు ఆధారం. అరటి తోటల నేల..ఎటు చూసినా పచ్చని చెట్లల్లో ఆకులు, అరటి గెలలు.. పొలాలు, వాగులు, కొండలు, నీళ్లు, మనుషులతో పాటే పెనవేసుకున్న కోళ్లు, మేకలు, ఆవుల జీవితాలు, అచ్చమైన పల్లెటూరి పేద వాడలు.

సెలవుల్లో పనంటే పిల్లాడికి పిచ్చి కోపం

శివనంద / శివనైన్జ స్కూల్లో చదువుకుంటున్న పిల్లవాడు. బడికి సెలవులు ఇచ్చిన రోజు తల్లి, అక్కతో కలిసి అరటి తోటల్లో అరటి గెలలు మోసి లారీలకు లోడ్ ఎక్కించే పనికి వెళ్ళాలి. ఆదివారాలు సెలవులు అంటే అతనికి కోపం. అక్క తెల్లవారే లేపేస్తుంది. పొద్దున ఊళ్ళోకి వచ్చే లారీలోకి ఎక్కి చీకటి పడేదాకా పని చెయ్యాలి. ఆ లేత శరీరం అంతటి శ్రమకు తట్టుకోలేదు. నేను పనికి రాను అని మారాం చేస్తాడు. తల్లి బతిమాలి బెదిరించి పనికి వెంటబెట్టుకు వెళ్తుంది.

నిత్యమూ ఏదో ఒక పెయిన్‌

క్లాసు మొత్తం మీద చక్కగా చదువుకుంటున్న ఒకే ఒక్క పిల్లవాడు శివనైన్జ. టీచర్ పూంకొడి అంటే ఎంతో అభిమానం. శివనంద జీవితంలో ఎదుర్కొనే రోజూవారీ సంఘర్షణ నుండి టీచర్ పట్ల ఆరాధన ఆ అబ్బాయికి గొప్ప రిలీఫ్‌ను ఇస్తుంది. కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ కోసం తప్పనిసరిగా పనికి వెళ్ళాల్సి రావడం. తల్లి అనారోగ్యంతో వెళ్ళలేకపోతే కాంట్రాక్టర్ మనుషులు గొడవ చెయ్యడం. తల్లి తన చెవి కమ్మలు అతనిముందు పడేయడం, ఉన్న ఒక్క ఆవునూ అమ్మేయడం.. ఇట్లా నిత్యమూ ఏదో ఒక పెయిన్‌లో ఉన్న ఆ పేదరికపు బాల్యం దినదిన గండం.

తనకై తాను బతకాలంటే పనిచేయాల్సిందే

పాత కాలంలో తల్లిదండ్రులు ఎందుకు పిల్లల పట్ల కఠినంగా ఉండేవారో, పిల్లల చేత పనిచేయించాలని ఎందుకు మొండిగా, పట్టుదలగా ఉండేవాళ్ళో శివనంద తల్లి మాటల్లో అర్థమవుతుంది. "తండ్రి జీవిత కాలం ఎర్ర జెండా పట్టుకొని ఊరూరా తిరిగి పట్టుబడి చనిపోయాడు. రేపు నేనూ పోతే వాడికై వాడు బతకగలగాలి కదా" అంటుంది.

తండ్రి తమకు ఇచ్చిన ఆస్తి తన చేతి మీద పొడిపించిన సుత్తి కొడవలి గుర్తు పచ్చబొట్టు మాత్రమే అని చూపిస్తుంది. ఆ గుర్తు ఉన్న స్టికర్‌ను జాగ్రత్తగా దాచుకోవడం, దాన్ని అక్క ఇష్టపడుతున్న యువకుడు కన్నికి ఇవ్వడం, అక్క చూపించే ప్రేమ, బడిలో స్నేహితుడు శేఖర్, చదువు, రజనీకాంత్ పాటలు, టీచర్‌తో పరిహాసాలు, ఏటిలో ఈతలు, ఆటలు ఇదీ శివనంద జీవితం.

అన్నం తింటూంటే బాదిపడేసిన తల్లి

బడిలో యానువల్ డే వేడుకలు ప్రారంభం కాబోతాయి. డ్యాన్స్ చేస్తానని పేరు ఇస్తాడు శివనంద. శనివారం సెలవైనప్పటికీ ఆ రోజు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం స్కూల్‌కి రావల్సి ఉంటుందని చెప్తుంది టీచర్. శనివారం నాడు కూలీ పని ఎంత ఎగ్గొట్టాలని ప్రయత్నించినా తల్లి వినదు. అక్క కూడా చెప్పి చూస్తుంది. అయినా అనారోగ్యంతో ఉన్న తల్లి శివనందను లారీ ఎక్కిస్తుంది. లారీలో దిగులుగా ఉండడం చూసి శేఖర్, అతని అక్క, కన్ని లారీ నుండి దింపేసి స్కూల్‌కు వెళ్ళమని పంపిస్తారు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు. ఆకలేసి అరటి తోటలో దూరితే అక్కడి కాపలా వాడు కొట్టి తరుముతాడు. మెల్లిగా ఇంట్లోకి వచ్చి అన్నం పెట్టుకొని తినబోతూ ఉండగా తల్లి లేచొచ్చి చూస్తుంది. కోపంతో కొడుతుంది. పారిపోయిన శివనంద ఆకలితోని అలసి సొలసి ఏటిగట్టున పడిపోతాడు.

అక్క నిర్జీవమై కనిపించినప్పుడు

కళ్ళు తెరిచి చూస్తే ఉదయపు వెలుగు. రాత్రంతా పడి ఉన్నాడు. ఊళ్లోకి వెళ్ళి చూస్తే..పోలీసులు.. అంబులెన్సులు... ఘోర విపత్తు.. ఊరంతా హాహాకారాలు.. నిండు లోడ్‌తో ఉన్న లారీ మీద ఎక్కిన కూలీలు ...లారీ బోల్తా పడడంతో పంతొమ్మిది మంది చనిపోతారు. ముందుగా శేఖర్ శవం, ఊరి కాంట్రాక్టర్ శవం చూసిన శివనంద పరిగెత్తి ఇంటి దగ్గరకు పోగా కన్ని, ప్రాణప్రదమైన అతని అక్క కూడా నిర్జీవమై..

బాధను అనుభూతి చెందడం జీవితకాల శిక్ష

పేపర్లో ఇలాంటి వార్త చదివినప్పుడు అయ్యో అనుకొని రెండో రోజుకు మర్చిపోతాం. ఆ దారుణంతో ప్రత్యక్షంగా రిలేట్ అయినవాళ్ళకు అది జీవితకాలపు శిక్ష. అంతటి డీప్ పెయిన్‌ను ఒక అద్భుతమైన పెయింటింగ్‌లా చూపించాడు మారీ సెల్వరాజ్..శివనందగా చేసిన అబ్బాయి పొన్ని నటనకు జాతీయ అవార్డు ఇవ్వచ్చు. ఆ ముఖంలోని నవ్వు, బాధ, ప్రతీ ఎక్స్‌ప్రెషన్ షీర్ బ్రిలియన్స్.

ఇది నోస్టాల్జియా సినిమా కాదు. అచ్చంగా జీవితమే.

మారీ సెల్వరాజ్ తీసిన ఈ సెల్యులాయిడ్ మాస్టర్ పీస్‌ను మిస్ కాకండి.

Disney Hotstar‌లో ఉంది.


- రజిత కొమ్ము

చిత్ర సమీక్షకురాలు


Similar News