ఆధార్‌లో ఈ పేరుందని స్కూల్ అడ్మిషన్ ఇవ్వలేదు..! పేరేంటో తెలుసా?
భారతీయ పౌరుడికి ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైనది. Girl's School Admission Rejected Due To Name On Aadhaar Card.
దిశ, వెబ్‌డెస్క్ః భారత దేశంలో అధికారమెక్కడానికి 'క్లీన్ చీట్' అవసరంలేదు గాని, అధికారిక విధానాలను పూర్తి చేయడానికి మాత్రం భారతీయ పౌరుడికి ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఎలాంటి గుర్తింపుకైనా ఆధారే ఆధారం!! అదే లేకపోతే, 'అసలు మనిషేనా..?!' అని అడుగుతారేమో అనుకొని, పుట్టిన బిడ్డకు కూడా వెంటనే ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు జనం. ప్రభుత్వ పథకాలు ఎక్కడ దూరమవుతాయో అనే భయంతో బిడ్డకు పేరుపెట్టకముందే ఆధార్ కార్డు తీసుకోవడం వల్ల ఓ బిడ్డకు స్కూల్లో సీటు దొరకలేదు పాపం! ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఓ చిన్నారికి అడ్మిషన్ కోసం వెళ్లడంతో ఆ బిడ్డ ఆధార్ కార్డుపై ఉన్న పేరు చూసి స్కూలు ఉపాధ్యాయులు నివ్వెరపోయారు. పేరు స్థానంలో 'మధు కా పంచ్వా బచ్చా', 'బేబీ ఫైవ్ ఆఫ్ మధు' (మధు ఐదవ బిడ్డ) అని రాసి ఉండడం ఉపాధ్యాయులకు విచిత్రంగా తోచింది. అంతేనా, కార్డులో ఆధార్ నెంబరు కూడా లేకపోవడం విశేషం. కార్డు ఇచ్చిన అధికారుల సంగతి అటుంచితే, పాపం, చిన్నారికి మాత్రం స్కూలు సీటు దొరకలేదు.
బిల్సీ తహసీల్‌లోని రాయ్‌పూర్ గ్రామానికి చెందిన దినేష్, తన కుమార్తె ఆర్తి అడ్మిషన్ తీసుకోడానికి ప్రాథమిక పాఠశాలకు వెళ్లినప్పుడే ఈ విషయం తెలిసింది. ఏక్తా వర్షిణి అనే ఉపాధ్యాయురాలు పాపకు అడ్మిషన్ నిరాకరించి, ఆధార్ కార్డును సరిచేయించుకోమని దినేష్‌ను కోరారు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ దీపా రంజన్ మాట్లాడుతూ, పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఆధార్ కార్డులు సిద్ధం చేస్తున్నామని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పొరపాటు జరిగిందని, బ్యాంకు, పోస్టాఫీసు అధికారులను అప్రమత్తం చేస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, ఇలాంటి కేసులు దేశావ్యాప్తంగా చాలానే ఉంటాయి. అంతకుమించి, మన దేశంలో పేరులేని వారు, తాతముత్తాతల పేరే గుర్తింపుగా ఉన్నవారు, కులమో, ఉన్న స్థలమో గుర్తుగా చేసుకొని బతికేవారు కూడా ఎంతో మంది లేకపోలేదు. వారందరి ఆధార్‌లు ఏలా ఉన్నాయో పాపం..?!