డ్రోన్‌తో కీమోథెరపీ మందుల డెలివరీ.. మూడున్నర గంటల సమయం ఆదా!

దిశ, ఫీచర్స్ : రోగులకు కీమోథెరపీ చికిత్సను సకాలంలో అందించే ప్రయత్నంలో తమ దేశంలోని రెండో అతిపెద్ద ఐలాండ్ ‘ఐల్ ఆఫ్ వైట్’ కోసం కొత్త డ్రోన్ డెలివరీ ట్రయల్‌ను యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) తాజాగా ప్రారంభించింది..Latest Telugu News

Update: 2022-07-08 08:33 GMT

దిశ, ఫీచర్స్ : రోగులకు కీమోథెరపీ చికిత్సను సకాలంలో అందించే ప్రయత్నంలో తమ దేశంలోని రెండో అతిపెద్ద ఐలాండ్ 'ఐల్ ఆఫ్ వైట్' కోసం కొత్త డ్రోన్ డెలివరీ ట్రయల్‌ను యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) తాజాగా ప్రారంభించింది. కీలకమైన ఔషధాల డెలివరీ సమయాన్ని మరింత తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోగా.. క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం మెయిన్ సిటీకి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడాన్ని ఈ ట్రయల్ ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు.

టెక్నాలజీ కంపెనీ అపియన్‌ అభివృద్ధి చేసిన ఆల్-ఎలక్ట్రిక్ డ్రోన్స్ నిలువుగా టేకాఫ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో పాటు క్షితిజ సమాంతర విమానంలా మారగలవు. ఒక్కో చార్జ్‌కు 1.5 గంటల ప్రయాణం చేస్తుండగా.. ట్రయల్స్‌లో భాగంగా పోర్ట్స్‌మౌత్ హాస్పిటల్స్ యూనివర్శిటీలోని ఫార్మసీ సిబ్బంది ఆ డ్రోన్‌లో మందుల్ని లోడ్ చేసి, ఐల్ ఆఫ్ వైట్‌లోని సెయింట్ మేరీస్ హాస్పిటల్‌కు పంపించారు. డ్రోన్ సేవలను వినియోగించడం ద్వారా కీమోథెరపీ ఔషధాల డెలివరీ సమయం నాలుగు గంటల నుంచి కేవలం 30 నిమిషాలకు తగ్గిపోవడం విశేషం. అంతేకాదు ఫెర్రీకి సంబంధించిన కార్బన్ ఉద్గారాలు(కనీసం రెండు కార్ల ప్రయాణాలను నివారించవచ్చు) కూడా తక్కువే.

'డ్రోన్ ద్వారా కీమో థెరపీ మందుల్ని డెలివరీ చేయడం క్యాన్సర్ రోగులకు మరొక వరంగా చెప్పొచ్చు. ప్రజలకు అవసరమైన చికిత్సను వీలైనంత త్వరగా పొందేందుకు కూడా ఈ ప్రయత్నం ముందుడుగు కాగా అదే సమయంలో ఖర్చులు, కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించేందుకు కృషి చేస్తున్నాం' అని NHS చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా ప్రిట్‌చార్డ్ పేర్కొన్నాడు.

రెండేళ్లుగా డ్రోన్ డెలివరీ సంభావ్యతను అన్వేషిస్తున్న UK రాయల్ మెయిల్ సర్వీస్(తపాలా సేవా సంస్థ), మేలో సొంత ట్రయల్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. రాబోయే కొన్నేళ్లలో 50 మార్గా్లో డ్రోన్ సేవలు అందించేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. 


Similar News