నెట్‌లో పర్సనల్ వీడియోలా.. భయం వద్దు! ఈ పని చేయండి
ఇప్పుడు కొందరు ప్రేమపేరుతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి.. వారి పర్సనల్ ఫొటోలు, వీడియోలు తీసుకుని వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు.

కొందరు ఆకతాయిలు ప్రేమపేరుతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి.. వారి పర్సనల్ ఫొటోలు, వీడియోలు తీసుకుని వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో హాస్టల్‌లో ఉంటూ బీటెక్ చదువుతున్న అమ్మాయికి ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెకు మాయమాటలు చెప్పి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు తీశాడు. అప్పటినుంచి ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. ఇదేగాక వాటిని అతడి స్నేహితులకు కూడా షేర్ చేయడంతో వారు కూడా ఆమెను బెదిరించారు. అయితే, ఆ అమ్మాయి ధైర్యంగా విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. అయితే, ఇలాంటి సమయాల్లోనే అమ్మాయిలు ధైర్యంగా ఉండి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు విషయాన్ని చెప్పాలి. ఒకవేళ నెట్ లో వారి ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేసినా భయపడాల్సిన పనిలేదు. ఇప్పడు కొత్తగా వచ్చిన ఏఐ టూల్స్ తో ఆ వీడియోలను నెట్ నుంచి పూర్తిగా డిలీట్ చేయవచ్చు. కాబట్టి ఎవరైనా ఇటువంటి సమస్యల్లో చిక్కుకున్నప్పుడు సమయస్ఫూర్తి, అవగాహనతో వ్యవహరిస్తే ఇబ్బందులను బయటపడవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైనది.. ఇటువంటి సమయాల్లో తల్లిదండ్రులు, కుటుంబానికి విషయాన్ని వెంటనే చెప్పాలి.
స్టాప్ ఎన్ సీ ఐఐ (stopncii.org)
స్టాప్ ఎన్ సీఐఐ అనే వెబ్‌సైట్ ప్రత్యేక మైన ఏఐ టూల్స్ ఆధారంగా బాధితుల ఫొటోలు, వీడియోలను ఇంటర్ నెట్ నుంచి పూర్తిగా తొలగిస్తుంది. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా మళ్లీ ఆ ఫొటోలు, వీడియోలను వేరే పేర్లతో అప్ లోడ్ చేయకుండా ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంది. దీంతో ఒకసారి ఆ ఫొటోలు, వీడియోలు తొలగించడంతోనే పని పూర్తయినట్టు ఈ వెబ్ సైట్ భావించకుండా.. భవిష్యత్తులోనూ వాటిని అప్ లోడ్ కాకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. అందుకే మహిళలు, యువతులు ఈ వెబ్ సైట్ గురించి తగిన అవగాహన ఉంటే ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ వెబ్ సైట్ ఓ పెన్ చేయగానే రిజిస్టర్ కేస్ అనే ఆప్షన్ వస్తుంది. అందులోనే మీ వయస్సు 18 సంవత్సరాలలోపా? అంతకంటే ఎక్కువా? అని ఆప్షన్లు వస్తాయి. ఇలా 8 రకాల ప్రశ్నలు ఉంటాయి. మీ సమాధానాలు తీసుకుని మీ ఫొటో, వీడియో డిలీట్ చేసేందుకు రిజిస్టర్ నంబర్, పిన్ నంబర్ ఇస్తుంది. ఆ తర్వాత ఫొటోలు ఎన్ని వెబ్ సైట్లలోకి వెళ్లాయి? ఎన్ని చోట్ల డిలీట్ అయ్యాయి? అన్నది చెక్ స్టేటస్ లో తెలుసుకోవచ్చు. దీంతోపాటు ఈ సంస్థ ఏ విధంగా సహాయపడుతుందన్న విషయాలు ఉంటాయి.
అమ్మాయిలు ఏం చేయాలి?
ఈ రోజుల్లో స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం అనేది కామన్. ఈ సందర్భంగా ఫొటోలు తీసుకోవడం సహజమే. కానీ, కొందరు వాటిని మార్ఫింగ్ చేసి.. లేదా సన్నిహితంగా ఉన్న సమయంలో తెలియకుండా ఫొటోలు తీసి బెదిరిస్తే అమ్మాయిలు భయపడకుండా ఈ పనులు చేయాలి. అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు.
1. తల్లిదండ్రులకు వెంటనే ఈ విషయం చెప్పాలి. అతడిని ఏ సందర్భంలో కలిసింది? లేదా అది మార్ఫింగ్ ఫొటో అన్న విషయం వారికి చెప్పాలి. వారు అర్థం చేసుకుంటారు.
2. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తితో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బేరసారాలకు దిగవద్దు. ఎందుకంటే వీరు వాడికి ఏటీఎం మిషిన్ లా మారిపోతారు. ఎందుకంటే ఒకసారి డబ్బు ఇస్తే.. వాడు అలుసుగా తీసుకుని జీవితాంతం ఇలాగే వేధిస్తూ ఉంటాడు.
3. పోలీసు స్టేషన్ లేదా మహిళల సమస్యలపై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి.
4. ఫొటోలు, వీడియోలు ఇంటర్ నెట్ పెట్టినట్టు తెలిస్తే స్టాప్ ఎన్ సీ ఐఐ. ఓఆర్ జీ (stopncii.org) వెబ్ సైట్ రిజిస్టర్ అయితే, ఆ ఫొటోలు వీడియోలు నెట్ నుంచి పూర్తిగా డిలీట్ అవుతాయి.