దిశ ప్రతినిధి,మేడ్చల్ : పోలీసు శాఖలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా.. అయితే గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు శుభవార్త. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్సై) అయ్యేందుకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఉచితంగా నాణ్యమైన శిక్షణను అందిస్తోంది. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తోంది. హైదరాబాద్ నగర శివారులోని వంటి మామిడిలోని గురునానక్ కళాశాలలో శ్యామ్ ఇన్‌స్టిట్యూట్, రాంకీ ఫౌండేషన్, గురునానక్ కళాశాల యాజమాన్యం సహకారంతో శిక్షణ కొనసాగుతోంది. అదనపు డీసీపీ మధుకర్ స్వామి నేతృత్వంలో ఈ శిక్షణ కొనసాగుతోంది.
2001లో ఫౌండేషన్‌కు అంకురార్పణ 2001లో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఏర్పాటైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరో నిరుద్యోగ పేద విద్యార్థులకు ఉద్యోగ శిక్షణను అందిస్తోంది. ఇప్పటి వరకు 7 బ్యాచ్‌లకు పోలీస్ ఉద్యోగ శిక్షణ ఇచ్చింది. 2003లో కొల్లాపూర్‌లోని మాధవస్వామి ఆలయ ప్రాంగణంలో 80 మంది యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పించారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి కొందరిని ఆర్టీసీలో హోంగార్డులుగా నియమించేలా చర్యలు తీసుకున్నారు. 2006-07లో వనపర్తిలోని భగీరథ రిసార్ట్స్‌లో శిక్షణ క్యాంపు నిర్వహించారు. 120 మందికి కానిస్టేబుళ్లు, ఎస్సై ఉద్యోగాల కోసం ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వగా 80 మంది ఎంపికయ్యారు. ఆరుగురు ఎస్‌ఐలుగా ఎంపికయ్యారు.
2009-10లో వనపర్తిలోనే 150 మంది నిరుద్యోగులకు వసతితో కూడిన శిక్షణ ఇచ్చారు. 48 మంది కానిస్టేబుల్స్‌గా ఎంపికకాగా, 8 మంది ఎస్‌ఐలుగా ఎంపికయ్యారు. 2015-16లో వనపర్తిలోని గాయత్రి కళాశాలతో పాటు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ కిస్మత్‌పురలో కో-ఆపరేటివ్, నోబెల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో వసతితో కూడిన శిక్షణను భాగ్యకిరణ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో నిర్వహించారు. రెండు ప్రాంతాల్లో సుమారు 400 మంది యువత శిక్షణ తీసుకొన్నారు. ఇందులో 68 మంది కానిస్టేబుల్స్‌గా, 8 మంది ఎస్‌ఐలుగా, 10 మంది స్పెషల్ పోలీస్ ఫోర్స్‌కు ఎంపికయ్యారు. 2018లో హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ ఆలయ ప్రాంగణంలో 200 మంది యువతకు సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చారు.
ఈ బ్యాచ్‌లో 62 మంది కానిస్టేబుల్స్‌గా, 10 మంది స్పెషల్ పోలీస్ ఫోర్స్‌గా, నలుగురు ఎస్‌ఐలుగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబర్ నుంచి నగర శివారు వంటిమామిడిలోని 300 మందిని ఎంపిక చేశారు. అందులో 60 మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. వనపర్తిలోనూ 300 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 27న అర్హత పరీక్ష.. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన బ్యాచ్ శిక్షణ ఈ నెల 31తో ముగియనున్నది. ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభించేందుకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ సన్నాహాలు చేస్తున్నది. అభ్యర్థుల ఎంపిక కోసం ఈ నెల 27వ తేదీన తెలంగాణలోని 33 జిల్లాల్లో అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. ఇందుకోసం ఈ నెల 23వ తేదీలోపు అభ్యర్థులు పరవస్తు ఫౌండేషన్ పేస్‌బుక్ లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా గూగుల్ ఫామ్‌ను నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత పరీక్షల్లో మెరిట్ సాధించిన 300 మంది నిరుద్యోగులకు ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. మరో 1000 మందికి ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేని వారికి ఆన్ లైన్ తరగతులు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు ఫోన్‌నంబర్‌ను సంప్రదించాలని 9542433427 ఫౌండేషన్ డైరెక్టర్ గద్దె భాస్కర్ తెలియజేశారు. నిరుద్యోగులకు సదావకాశం.. మధుకర్ స్వామి నిరుద్యోగ పేద అభ్యర్థులకు ఎంతో మంచి అవకాశం.. శిక్షణ కేంద్రంలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పిస్తాం. శిక్షణకు వచ్చే వారికి కేవలం శిక్షణ ఇవ్వడమే కాదు, ఎప్పటికప్పుడు వారి ప్రతిభను గుర్తించేందుకు మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తాం. ఈ పరీక్షలతో ఎవరికి ఎక్కడ మార్కులు తగ్గుతున్నాయనే విషయం తెలుస్తుంది. పరీక్షలు నిర్వహించి వారికి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ ఫైనల్ పరీక్షలకు సిద్ధం చేస్తాం. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారందరూ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో బోధన సాగుతోంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
-మధుకర్ స్వామి,అదనపు డీసీపీ