హైకోర్టుకు చేరిన 'దిశ' కేసు

వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ హత్యాచారం సంఘటనలో నిందితులుగా ఉన్న నలుగురూ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుండగా ఉద్దేశపూర్వకంగా వారిని కాల్చి చంపారంటూ

Update: 2022-07-04 17:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వెటర్నరీ డాక్టర్ 'దిశ' హత్యాచారం సంఘటనలో నిందితులుగా ఉన్న నలుగురూ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుండగా ఉద్దేశపూర్వకంగా వారిని కాల్చి చంపారంటూ జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక తదుపరి ఫాలో అప్ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డిని అమికస్ క్యూరీగా హైకోర్టు నియమించింది. నివేదికలో నలుగురు యువకులను (నిందితులు) పోలీసులు ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చి చంపారని కమిషన్ తన నివేదికలో పేర్కొన్నది. సుప్రీంకోర్టుకు ఈ నివేదికను సమర్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు, కమిషన్ నివేదికపై భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ మొత్తం ఫైల్‌ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దానికి కొనసాగింపుగా సోమవారం ఈ వ్యవహారంలో దేశాయ్ ప్రకాశ్‌‌రెడ్డిని అమికస్ క్యూరీగా హైకోర్టు నియమించింది.

లోతైన దర్యాప్తు జరిపి సాక్షుల నుంచి, బాధితుల కుటుంబ సభ్యుల నుంచి, పోలీసుల నుంచి వివరాలను సేకరించడంతో పాటు సంఘటనా స్థలానికి వెళ్ళి అద్యయనం జరిపిన కమిషన్ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌‌లో సమర్పించిన నివేదికలో బూటకపు ఎన్‌కౌంటర్ అని స్పష్టం చేసింది. ఈ సంఘటనలో పాల్గొన్న పది మంది పోలీసులు, అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని సిఫారసు చేసింది. భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను కూడా సూచించింది. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు ఈ కేసు బదిలీ కావడంతో త్వరలోనే విచారణ మొదలుకానున్నది.

Tags:    

Similar News