మేయర్ వర్సెస్ కార్పొరేటర్లు.. పాలక మండలిలో ఆధిపత్య పోరు

Update: 2022-03-16 02:11 GMT

దిశ, సిటీ బ్యూరో: కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన జీహెచ్ఎంసీ పాలక మండలిలో తరుచూ ఆధిపత్య పోరు బయటపడుతుంది. అధికార పార్టీకి చెందిన పాలకమండలి పెద్దలు, సభ్యులు, విపక్షాలకు చెందిన కార్పొరేటర్లపై పైచేయి సాధించేందుకు అధికార పార్టీ కార్పొరేటర్లు, పాలకమండలి పెద్దలు తమ స్వప్రయోజనాల కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలు రాజకీయంగా ఇరు పార్టీలకు చెందిన కార్పొరేటర్లకు ఆసక్తికరంగానే ఉన్నా, కలిసి మెలిసి నగరవాసుల సమస్యలను పరిష్కరించి.

అభివృద్ధికి పాటుపడాల్సిన పాలక మండలి సభ్యులు ఈ ఆధిపత్య పోరుతో ప్రజలకేం సమాచారమివ్వాలనుకుంటున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎన్నికైనప్పటి నుంచి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వ్యవహార శైలి విపక్షాలకు చెందిన సభ్యులు, సామాన్య ప్రజల్లోనే అధికార పార్టీకి చెందిన అమాత్యులు, కార్పొరేటర్లలోనూ వివాదాస్పదమవుతున్న సంగతి తెల్సిందే. సొంత పార్టీకి చెందిన సాటి మహిళా కార్పొరేటర్లు, అదే పాలక మండలిలోని డిప్యూటీ మేయర్‌తొ కూడా ఆమెకున్న సమన్వయం అంతంతమాత్రమేనని చెప్పవచ్చు. ఇందుకు గాను ఇప్పటి వరకు వారిద్దరి మధ్య బయటపడ్డ చిన్న చిన్న విభేదాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తాజాగా మరో వివాదానికి తెరదీశారు.

మలక్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐఎస్ సదన్ మున్సిపల్ డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మేయర్ మంగళవారం అధికారులతో కలిసి అఫీషియల్ పర్యటనను నిర్వహించారు. కానీ అక్కడి స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్వేతారెడ్డి తన డివిజన్‌లొ తనకు తెలియకుండా అఫిషియల్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. డివిజన్ కార్పొరేటర్‌కు సమాచారమివ్వాల్సిన పని నాదా? అంటూ మేయర్ మాట్లాడుతుండగానే మేయర్ గన్ మ్యాన్ బీజేపీ కార్పొరేటర్ అనుచరుడిని తోసేశారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు మేయర్ గన్ మ్యాన్ క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తర్వాత అధికారులు జోక్యం చేసుకుని సముదాయించటంతో బీజేపీ కార్పొరేటర్, నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మేయర్ వెనుదిరిగి వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి ఏకంగా 48 మంది కార్పొరేటర్లు గెలుపొందిన, వారికెక్కడ ప్రాధాన్యతనివ్వకుండా అధికార పార్టీ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తరుచూ వివాదాలకు తెర తీయటం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News