అమ్మాయిలు ఎంతో ఎత్తుకు ఎదిగినా.. వాళ్లని ఇంకా భారంగానే చూస్తున్నారు
దిశ దేవరకొండ, డిండి: మూడో కాన్పులో సైతం ఆడపిల్ల పుట్టిందని తన ఊర్లోకి వెళ్లితే పరువు పోతుందని..
దిశ దేవరకొండ, డిండి: మూడో కాన్పులో సైతం ఆడపిల్ల పుట్టిందని తన ఊర్లోకి వెళ్లితే పరువు పోతుందని.. ఆడపిల్ల మాకొద్దు అంటూ.. ఏకంగా ఐసీడీఎస్ అధికారులకు ఫోన్ చేసి శిశువును తీసుకుపొండని శిశు తండ్రి, నానమ్మ చెప్పిన విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. డిండి మండలం ప్రతాప్ నగర్ గ్రామానికి చెందిన కేతావత్ శివనందిని, బాలు భార్యాభర్తలు. వీరికి వివాహం జరిగి నాలుగేళ్లు అవుతోంది. వీరు ఊరిలో వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలకు జన్మించారు. శనివారం రాత్రి 1:00 సమయంలో శివ నందినికి పురిటి నొప్పులు రావడం తో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా మూడో కాన్పులో కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న భర్త బాలు నాకు మళ్ళీ ఆడపిల్ల పుట్టింది వద్దంటూ.. రాత్రి 1.30కి ఐసీడీఎస్ సూపర్వైజర్‌కు ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్, పోలీసులకు తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి శనివారం ఉదయం హాస్పిటల్ వద్ద శివ నందిని, భర్త బాలు, నానమ్మ అశ్లీ లకి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ.. శిశువు పేరిట 30 వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తల్లిదండ్రులకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయిస్తానని తెలపడంతో తల్లిదండ్రులు, నానమ్మ తమ బిడ్డను పెంచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రేణుక, సర్పంచ్ లక్ష్మీ తిరుపతి, ANM చంద్రకళ, ఆశా వర్కర్ అస్లీ, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.