పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
దిశ, తెలంగాణ బ్యూరో : పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది.
దిశ, తెలంగాణ బ్యూరో : పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు, వివిధ డిమాండ్లను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) ఆధ్వర్యంలో టీచర్లు మంగళవారం విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. కాగా వారిని కార్యాలయం లోనికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు పలు కేడర్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు చేశారు. తెలంగాణ సర్కార్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపణలు చేశారు. అంతేకాకుండా విద్యాశాఖలో అన్ని కేడర్లలో గల 25 వేల పోస్టులకు పదోన్నతులు కల్పించకుండా కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖలో అధికారులు రోజుకో తప్పుడు వార్తను ప్రకటిస్తూ ఉపాధ్యాయ లోకాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠశాలలో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల భర్తీ, మౌలిక వసతుల కల్పన చేపట్టకపోవడంపై వారు మండిపడ్డారు. ఇంగ్లిష్ మీడియం బోధనకు అదనంగా ఉపాధ్యాయులను నియమించాలని వారు డిమాండ్ చేశారు.
అంతేకాకుండా 317 జీవో బాధితుల డిమాండ్లను పరిష్కరించాలని, పండిట్, పీఈటీల అప్ గ్రేడేషన్ చేయాలన్నారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలను అందించకపోవడంపై మండిపడ్డారు. నాలుగేండ్లుగా బదిలీలు చేపట్టకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బదిలీలు, పదోన్నతుల షెడ్యూలు ప్రకటించాలని జాక్టో నేతలు డిమాండ్ చేశారు. డీఎస్ఈ కార్యాలయం ముట్టడిలో పలు జిల్లాల జాక్టో నాయకులు కొంగల వెంకట్, ప్రేమ్ కుమార్, దానయ్య, భాస్కర్ శివరాజయ్య, హేమచంద్ర, నరేశ్, లక్ష్మణ్, సుభాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.