దేశమంతా ఏకరీతి దాన్య సేకరణ చేయాల్సిందే.. చెరుకు సుధాకర్
దిశ, తెలంగాణ బ్యూరో: వరి పండించిన - Telangana Inti Party President Cheruku Sudhakar said that uniform foodgrains should be procured all over the country
దిశ, తెలంగాణ బ్యూరో: వరి పండించిన రైతుకు ఉరి శరణ్యమన్నట్లుగా ప్రభుత్వాల వాదనలు కొనసాగవద్దని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వరి సేద్యం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత లక్షల ఎకరాల్లో ఇతర పంటలు వేసినా, 35 లక్షల ఎకరాల్లో వరి పంట చేతికి వచ్చి రైతులు అయోమయ స్థితిలో ఉన్నారని, రైతులు పండించిన పంటనంతా కేంద్రం కొనుగోలు చేయడం సాద్యం కాదని ఆహార పౌర సరపరాల మంత్రి పీయూష్ గోయిల్ మొండిగా ప్రకటించడంలో తెలంగాణ రైతాంగం ఆగ్రహంతో ఉందన్నారు.
యాసంగిలో పండించిన వరి దాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయకపోతే కనీస మద్దతు ధర ప్రకటించడం ప్రధాని భాద్యత అని, అందుకోసం జాతీయ ఆహార దాన్యాల సేకరణ విధానం అమలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాయడాన్ని తెలంగాణ ఇంటి పార్టీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమన్వయంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులను ఆదుకోవడానికి, రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి అఖిలపక్షాన్ని పిలువాల్సి ఉన్నదని, పెంచిన విద్యుత్ చార్జీలు, ఇప్పటికే కేంద్రం పెంచిన గ్యాస్, డిజిల్, పెట్రోల్‌కు తోడు సామాన్యులకు మరింత గుదిబండగా తయారవ్వకుండా పునరాలోచించి తగ్గించాలని డిమాండ్ చేశారు.
జాతీయ పార్టీగా బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలను బుల్డోజ్ చేయడానికి బుల్డోజర్స్ తెచ్చుకుంటే తెలంగాణ దంగల్‌లో తలపడడానికి ప్రతి తెలంగాణ ఉద్యమ ప్రయోజన నాయకుడు సిద్దం కావాలన్నారు. ఏ జాతీయ పార్టీ, రాష్ట్రాల ప్రయోజనాలను చిన్నచూపు చూసినా వ్యతిరేకించవలసిందేనని, కేంద్రం పై రాష్ట్ర ప్రయోజనాలకై ఆందోళన, ఉద్యమం ఎంత అవసరమో, రైతాంగాన్ని ఆదుకోవడం అంతే అవసరమరమని సీఎం గుర్తించాలని, దాన్యం కొనుగోలు ప్రత్యామ్నయ ఏర్పాట్లను సమాంతరంగా కొనసాగించాలని కోరారు. తొండి వైఖరి, మొండి వైఖరి ఎటువైపు నుండి ఉన్నా.. నష్టపోయేది తెలంగాణ అన్నదాతలేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో సింగరేణి, కాళేశ్వరం, తదితర ఆంశాలపై కూడా అఖిలపక్షాల సమన్వయం అవసరమని తెలంగాణ ఇంటి పార్టీ భావిస్తున్నట్లు పేర్కొన్నారు.