సబ్‌స్క్రిప్షన్ ధరలను తగ్గించే యోచనలో 'టాటా ప్లే'!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద డీటీహెచ్ సర్వీసెస్ సంస్థ టాటా ప్లే తన వినియోగదారులకు..latest telugu news
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద డీటీహెచ్ సర్వీసెస్ సంస్థ టాటా ప్లే తన వినియోగదారులకు సబ్‌స్క్రిప్షన్ ధరలను ఏకంగా సగానికి తగ్గించాలని భావిస్తోంది. గత కొంతకాలంగా ఓటీటీ పరిశ్రమకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో నెలవారీ ఛానెల్ ప్యాక్‌ల ధరలను తగ్గించి వినియోగదారులను మరింత ఆకట్టుకునేలా చేసేందుకు టాటా ప్లే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల కంపెనీకి సగటు వినియోగదారు ఆదాయం తగ్గుతుంది. గత రెండేళ్లుగా డీటీహెచ్ పరిశ్రమ అనేక రకాలుగా నష్టాల్లోనే కొనసాగుతోంది.
ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం ద్వారా ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రైబర్లను కాపాడుకునేందుకు వీలవుతుందని కంపెనీ భావిస్తోంది. టాటా ప్లే(గతంలో టాటా స్కై) ప్రస్తుతం 1.9 కోట్ల మంది యాక్టివ్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నట్టు వెల్లడించింది. 'గత కొంత కాలంగా వినియోగదారుల ఆసక్తిలో మార్పులు కనిపించాయి. ఆకట్టుకునే కంటెంట్ ఉన్న సమయంలో చేసే దానికి, మిగిలిన సమయంలో చేసే రీఛార్జ్‌లో స్పష్టం బేధం కనబడుతోంది. ఇలాంటి సమయంలో వినియోగదారులను అనుకూలంగా తక్కువ ధరల్లో ప్లాన్‌లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని భావించామని' టాటా ప్లే ఎండీ హరిత్ నాగ్‌పాల్ అన్నారు. అయితే, ఛానళ్ల రేట్ల తగ్గింపు ఇదివరకు సబ్‌స్క్రైబర్ చూసిన ఛానెళ్లను బట్టి నిర్ణయించబడుతుంది. వారికి అవసరమైన ఛానెళ్లను చూసే విధంగా ధరల తగ్గింపు ఉంటుంది. ఇలాంటి నిర్ణయం వల్ల వినియోగదారులకు రూ. 30-100 వరకు ఆదా అవుతుందని ఆయన వివరించారు.