దిశ, కొడంగల్ : మార్చి చివరి మాసంలోనే ఎండల తీవ్రత ఎక్కువ అవ్వడంతో మధ్యాహ్నం అయ్యింది అంటే చాలు జనాలు ఇంటికే పరిమితం అవుతున్నారు. రోడ్లన్నీ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. అంతా అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు . పైగా ప్రజలు తమ పనులను మధ్యాహ్నంలోపు పనులు ముగిసెలా అంచనా వేసుకుని బయటకు వస్తున్నారు. ఇది ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభం అవ్వడంతో మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు సొంత ఊర్లకు వెళ్లడం కష్టతరం అయింది అని చెప్పవచ్చు.
దీనికి తోడు భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో ఈ యాసంగి సాగులో బోర్ల పై ఆధారపడి వరి పంట సాగు చేసిన రైతులకు పంట చేతికి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉండటంతో రైతులు రాత్రి పగలు అనే తేడ లేకుండా పంట పొలం వద్దనే పడిగాపులు కాస్తూ పంట పొలాలకు సాగు నీరు అందిస్తున్నారు. దీనిపై రైతులను ఆరా తీస్తే ప్రతి సంవత్సరం ఇదే విధంగా అవుతుంది అని ఈ కొడంగల్ నియోజకవర్గం కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పథకం ద్వారా సాగు నీరు అందిస్తాం అని ఎన్నికల్లో హామీ ఇస్తున్నారు తప్ప పనులు జరగడం లేదు. కృష్ణ నది అతి సమీపంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చిన ఈ ప్రాంత రైతులకు అందించడం లేదని, దీని వల్ల వేసవి కాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.