సీఎం కేసీఆర్ స్కెచ్.. ఆ రెండు పార్టీలకు చెక్

ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్‌కు విపక్షాలు విలవిల్లాడుతున్నాయి. కక్కలేని, మింగలేని చిక్కుల్లో పడేశారు కేసీఆర్.

Update: 2022-03-09 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్‌కు విపక్షాలు విలవిల్లాడుతున్నాయి. కక్కలేని, మింగలేని చిక్కుల్లో పడేశారు కేసీఆర్. ఒక్క ప్రకటనతో రెండు ప్రయోజనాలు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 'నిరుద్యోగ జంగ్ సైరన్'కు, బీజేపీ 'మిలియన్ మార్చ్'కు బ్రేకులు వేశారు. మరోవైపు ప్రగతి భవన్ ముట్టడి, ఛలో అసెంబ్లీ, ధర్నాచౌక్‌లో నిరనసలకు తావు ఇవ్వకుండా విద్యార్థులను, యువతను పుస్తకాల్లో నిమగ్నమయ్యేలా చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కాన్వాయ్‌లకు అడ్డం పడే సంఘటనలకు చెక్ పెట్టారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చినా రోడ్లమీదకు రావడానికి వీలు లేని పరిస్థితులను సృష్టించారు.

ప్రభుత్వంపైనా, అధికార పార్టీపైనా అసంతృప్తి మరింత పెరగకుండా నోటిఫికేషన్లతో అడ్డుకట్ట వేశారు. ఒక్కసారిగా 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేలా భారీ ప్రకటన చేయడంతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఎంత దూకుడుతో అసెంబ్లీలో ప్రకటన చేశారో అంతే వేగంతో నోటిఫికేషన్లను కూడా ఇచ్చేలా ఆయా విభాగాలకు సీఎం కేసీఆర్ టాస్క్ అప్పగించారు. తొలుత పోలీసు, విద్యాశాఖల్లోని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రెండూ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సంబంధం లేకుండా ఆయా డిపార్టుమెంట్లకు చెందిన బోర్డులు, యంత్రాంగమే దరఖాస్తుల మొదలు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, కౌన్సిలింగ్ వరకు చూసుకోనున్నాయి.

ఇంటెలిజెన్స్ విభాగం సహా వివిధ ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నాడిని పసిగట్టి అందించిన నివేదికలపై కేసీఆర్ ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటున్నారని, దానికి అనుగుణంగానే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారని టీఆర్ఎస్ వర్గాలు ఉదహరించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 1.33 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల మొదలు ఇటీవలి కాలం వరకు ఓపెన్ లెటర్ ద్వారా క్లారిటీ ఇచ్చినా ప్రజల్లో సానుకూల స్పందన రాలేదన్న విషయాన్ని గులాబీ పార్టీ గ్రహించింది. పీఆర్సీ కమిషన్ నివేదికలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు వివరాలు బైటకు పొక్కడం ఆ పార్టీని ఇరుకున పెట్టింది. యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాలపై భారీ నమ్మకాలే పెట్టుకున్నారు. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసినా రాకపోవడంతో అసంతృప్తిని వెళ్ళగక్కారు.

ఇలాంటి పరిస్థితులన్నింటినీ గులాబీ బాస్ గమనంలోకి తీసుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఇటీవల జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు బీజేపీకి చెందిన ఏబీవీపీ, బీజేవైఎం విభాగాల కార్యకర్తలు కాన్వాయ్‌లను అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సైతం తరచూ ప్రగతి భవన్ ముట్టడి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసు ముందు ధర్నా చేయడం లాంటివి అధికార పార్టీలో అసహనం పుట్టించాయి. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 61 ఏళ్ళకు పెంచడం ద్వారా నిరుద్యోగుల్లో పెరిగిన ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో సీఎంకు నివేదికలు అందాయి.

మరోవైపు జోనల్ వ్యవస్థకు అనుగుణంగా టీచర్ల, ఉద్యోగుల కేటాయింపు, పోస్టింగుల విషయంలో బహిర్గతమైన ఆవేదన, అసంతృప్తి కూడా అధికార పార్టీకి చికాకు పుట్టించింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వార్తలు, పోస్టింగులు, ప్రభుత్వంపై సెటైర్లు, అధికార పార్టీ పట్ల పెరుగుతున్న తదితరాలన్నీ కేసీఆర్‌కు విసుగు పుట్టిస్తున్నాయి. ఇటీవల మీడియా సమావేశాల్లో సోషల్ మీడియాపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఐటీ విభాగం సైతం సోషల్ మీడియాలో పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న పోస్టింగుల తీవ్రతను గమనించి డ్యామేజీ కంట్రోల్ ఎత్తుగడలను మొదలుపెట్టాయి.

గ్రౌండ్‌లో పార్టీ, ప్రభుత్వంపైన విద్యార్థులు, నిరుద్యోగుల్లో మాత్రమే కాక వివిధ సెక్షన్ల ప్రజల్లో పొడసూపుతున్న అసంతృప్తి సమీప భవిష్యత్తులో వ్యతిరేకత స్థాయికి పెరగకముందే చక్కదిద్దాలని కేసీఆర్ భావించారని, అందులో భాగమే జనవరి చివరి నాటికే ఖాళీ పోస్టుల లెక్కలను తేల్చి ఫిబ్రవరిలో ప్రకటన చేయాలనుకున్నారని టీఆర్ఎస్‌కు చెందిన ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. ఆ వ్యూహంలో భాగమే చీఫ్ సెక్రటరీ ద్వారా జనవరి చివరికల్లా కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం కేటాయింపులు, జాయినింగ్‌లు, పోస్టింగుల్లో చేరేలా సర్క్యులర్లను జారీ చేయడం. సచివాలయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికే ఖాళీ పోస్టుల భర్తీపై సీఎం ప్రకటన చేయాల్సి ఉన్నది.

దానికి అనుగుణంగానే ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖలకు చెందిన అధికారులు సుమారు 76 వేల ఖాళీ పోస్టుల వివరాలను డిపార్టుమెంటుల వారీగా అందించారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో కాస్త ఆలస్యమైందని పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయడంతో నెల రోజుల వ్యవధిలోనే కనీసంగా రెండు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం ఆరు నెలల వ్యవధిలో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి కూడా జరగొచ్చని, ఈ ఏడాది చివరికల్లా ఆ రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన కౌన్సిలింగ్, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వస్తుందని వారి అభిప్రాయం.


కేసీఆర్ వ్యూహం ఇదే.. నిరుద్యోగ భృతికి బ్రేక్​!?

Tags:    

Similar News