శ్రీధర్ బాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన డిప్యూటీ స్పీకర్

హైదరాబాద్‌లో ప్రతి పాన్ షాపు బెల్ట్ షాపే.. ప్రతి కిరాణ షాపు బెల్ట్ షాపే అని, అక్రమ మ‌ద్యం అమ్ముతున్నార‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

Update: 2022-03-11 15:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లో ప్రతి పాన్ షాపు బెల్ట్ షాపే.. ప్రతి కిరాణ షాపు బెల్ట్ షాపే అని, అక్రమ మ‌ద్యం అమ్ముతున్నార‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శుక్రవారం శాసనసభలో ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ జోక్యం చేసుకొని ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయొద్దని సూచించారు. హైద‌రాబాద్ సిటీలో ఎక్కడా కూడా బెల్ట్ షాపు అనేది ఉండ‌దని, హైద‌రాబాద్ మొత్తంలో ఒక్క బెల్ట్ షాపు కూడా ఉండ‌దన్నారు. జిల్లాల్లో కూడా ఎట్ల ఉంట‌ది అంటే.. మండల హెడ్ క్వార్టర్స్ ద‌గ్గర ఎక్కడో ఒక చోట‌, 10 కిలోమీట‌ర్ల దూరంలో వైన్ షాపు ఉంట‌ుందని, అక్కడికి వెళ్లి తెచ్చుకునేందుకు ఇబ్బంది ప‌డుతార‌ని చెప్పి.. అదేదో తెచ్చి గ్రామాల్లో పెడుతారన్నారు.

అయితే గ్రామంలో, కిర‌ణా షాపుల్లో, అక్కడ ఇక్కడ బెల్ట్ షాపులు ఉండ‌వని స్పష్టం చేశారు. గ‌తంలో ఎక్సైజ్ మంత్రిగా ప‌ని చేశాను.. తాను ఇక్కడ కూర్చొని చెప్పొద్దు కానీ చెప్పాల్సి వ‌స్తుంద‌ని డిప్యూటీ స్పీక‌ర్ పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలుగజేసుకొని పాన్ షాపుల్లో, కిరాణాషాపుల్లో అక్రమంగా మద్యం అమ్మడం లేదన్నారు. ఎక్కడ అమ్ముతున్నారో పోదాంపదా అన్నారు. నాడు నాయకులు జేబులు నింపుకునేందుకు బెల్టుషాపులు నిర్వహించారని, కానీ ఇప్పుడు అలాంటిది లేదన్నారు. అందుకే ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News