ఎముకల క్షీణతకు గురవుతున్న ఆస్ట్రోనాట్స్‌‌!

దిశ, ఫీచర్స్ : రానున్న దశాబ్దాల్లో అంతరిక్ష యాత్రలు ప్రారంభం కానున్నాయి.

Update: 2022-07-02 07:59 GMT

దిశ, ఫీచర్స్ : రానున్న దశాబ్దాల్లో అంతరిక్ష యాత్రలు ప్రారంభం కానున్నాయి. నాసా చేపట్టిన ఆర్టెమిస్ మిషన్స్‌తో చంద్రునిపై పాగా వేయాలని యోచిస్తోంది. 2024లో చేపట్టబోయే ఆర్టెమిస్-3 లో భాగంగా వ్యోమగాములు చంద్రమండలంపైకి చేరుకోనుండగా, ఆ తర్వాత వారిని క్రమం తప్పకుండా అక్కడికి పంపనుంది. ఇక 'వర్జిన్, స్పేస్‌ఎక్స్' వంటి అనేక ప్రైవేట్ స్పేస్ కంపెనీలు అంగారక గ్రహాన్ని వలసరాజ్యం చేయడంపై దృష్టి పెట్టాయి. అయితే స్పేస్ టూరిజంలోకి, కొత్త అంతరిక్ష యుగం ప్రారంభంలోకి ప్రవేశిస్తున్న వేళ.. మానవులపై దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణ ప్రభావాల గురించి తెలుసుకోవాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలోనే నెలల తరబడిగా మైక్రో గ్రావిటీ అనేది శరీరాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్న అంశంపై నిర్వహించిన పరిశోధనలో నెగెటివ్ రిపోర్ట్స్ వెలువడటం గమనార్హం.

ఇటీవలే ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో మూడు నెలలకు పైగా గడిపిన వ్యోమగాములు ఎక్స్‌టెన్సివ్ 'బోన్ లాస్' నుంచి పాక్షికంగా మాత్రమే కోలుకున్నారని కాల్గరీ యూనివర్సిటీ రీసెర్చర్లు కనుగొన్నారు. ఇది భూమిపై నివసించే మానవుల్లో సహజంగా సంభవించినప్పటికీ, శరీరం మైక్రోగ్రావిటీకి గురైనప్పుడు ఆ నష్ట తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి ఆరు నెలల అంతరిక్ష యాత్ర.. దశాబ్దాల విలువైన ఎముక క్షీణతకు దారితీస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మక మిషన్లను ప్రారంభించబోతున్న ప్రస్తుత తరుణంలో భవిష్యత్ వ్యోమగాములకు అంతర్దృష్టిని అందించేందుకు అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యక్తిపై ఆయా ప్రభావాల గురించి తెలుసుకోవాలని రచయితలు ప్లాన్ చేస్తున్నారు.

'అంతరిక్ష యానం నుంచి తిరిగొచ్చిన తర్వాత బలహీనత, బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కొందరు ఆస్ట్రోనాట్స్ నడవడానికి ఇబ్బందిపడతే, మరికొందరు మాత్రం ఎలాంటి అలసట లేకుండా ఉల్లాసంగా బైక్‌పై ప్రయాణించే వారిని చూశాం. ఇలా వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చినప్పుడు వారి మధ్య చాలా భిన్నమైన ప్రతిస్పందనలు ఉన్నాయి' అని మెక్‌కైగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బోన్ అండ్ జాయింట్ హెల్త్ డైరెక్టర్, అధ్యయన సహ రచయిత స్టీవెన్ బోయిడ్ పేర్కొన్నాడు.

'అతి తక్కువ సమయంలోనే వ్యోమగాముల శరీరంపై ప్రభావం పడుతుంది. ఏదేమైనా అంతరిక్షంలోని మైక్రో గ్రావిటీ పర్యావరణం వల్లే ఈ సమస్య తలెత్తుతుంది. ఎముకల ఆరోగ్యం వెనకున్న అతి పెద్ద కారకాల్లో బరువు కూడా ఒకటి. ఎందుకంటే కండరాల మాదిరిగానే ఎముకలు కూడా తమ బరువును, బలాన్ని కాపాడుకోవడానికి ఒత్తిడికి గురవుతాయి. అలా లేకపోతే కాలక్రమేణా బలహీనపడతాయి. ఒకవేళ శరీరం చాలా తక్కువ బరువుతో ఉన్నట్లయితే, ఇది బోలు ఎముకల వ్యాధి సహా తీవ్రమైన ఎముకల సమస్యలకు దారి తీసి పెళుసుగా మారేందుకు కారణమవుతుంది. అప్పుడు దగ్గినా కూడా పక్కటెముకలు విరిగిపోతాయి. ISS మైక్రో గ్రావిటీ వాతావరణం కాలక్రమేణా గణనీయమైన ఎముక క్షీణతకు దారితీస్తుంది. అయితే వ్యోమగాములను ఒకరితో మరొకరిని కంపేర్ చేసినప్పుడు లాస్ వాల్యూ, రికవరీ మొత్తం మారుతుంది.

- లీ గేబెల్, కినిసాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అధ్యయన ప్రధాన రచయిత

Tags:    

Similar News