సౌతాఫ్రికా వ‌ర‌ద‌లు: 5 నెల‌ల వ‌ర్షం 3 రోజుల్లోనే.. అంతా జ‌ల‌మ‌యం!

ద‌క్షిణ ఆఫ్రికాలో వ‌ర్ష బీభ‌త్సం తీవ్ర‌స్థాయికి చేరుకుంది. South Africa closed after heavy rains and floods.

Update: 2022-04-13 11:30 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః మ‌నుషుల‌పై ప్ర‌కృతి ప‌గ‌బ‌ట్టింది! ఆధునిక మానువుడి కాలుష్యకార‌క చ‌ర్య‌లు చివ‌రికి త‌న‌నే నాశ‌నం చేస్తున్నాయి. అకాల వ‌ర్షాలతో భూమి అల్ల‌క‌ల్లోలం అవుతుంది. అవును, తాజాగా, ద‌క్షిణ ఆఫ్రికాలో వ‌ర్ష బీభ‌త్సం తీవ్ర‌స్థాయికి చేరుకుంది. క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లో ఇప్పటివరకు 59 మంది ప్రాణాలు కోల్పోగా, తీవ్రమైన వరదల కారణంగా దక్షిణాఫ్రికాలోని అత్యంత రద్దీగా ఉండే ఓడరేవులో షిప్పింగ్ కూడా నిలిపివేశారు. ఐదు నెలల కాలంలో కుర‌వాల్సిన‌ వర్షం కేవలం మూడు రోజుల్లోనే కురవ‌డంతో ప్రావిన్స్‌లోని రోడ్లు, వంతెనలు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వరదల కారణంగా పర్యావరణానికి నష్టం వాటిల్లినందున తదుపరి నోటీసు వచ్చే వరకు డర్బన్ ఓడరేవును మూసివేసినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని లాజిస్టిక్స్ కంపెనీ ట్రాన్స్‌నెట్ తెలిపింది. దీంతో అంత‌ర్జాతీయంగా ఆందోళ‌న నెల‌కొంది.

ఇక‌, ఆ దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో టెర్మినల్స్‌కు వెళ్లే రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. రద్దీగా ఉండే హైవేకి సమీపంలో ఉన్న షిప్పింగ్ కంటైనర్ గోదాము తీవ్రంగా వరదలకు గురైంది. వందలాది కంటైనర్లు ఉధృతంగా ప్రవహించే నీటిలో కొట్టుకుపోయాయి. డర్బన్ నగరం ప్రకృతి వైపరీత్యానికి కేంద్రంగా మారింది. ఈ ప‌రిణామం మానవతా సంక్షోభానికి దారితీస్తుంద‌ని నిపుణులు ఆందోళ‌న చెందుతున్నారు. డర్బన్‌ను ఆర్థిక కేంద్రమైన గౌటెంగ్‌తో కలిపే కీలకమైన N3 హైవే భాగాలన్నీ ఇప్పుడు బ్లాక్ చేశారు. స‌మాచార వ్య‌వ‌స్థ‌ల‌కు అంతరాయం ఏర్పడింది. రెండు ప్రధాన టెలికాం కంపెనీల మొబైల్ ఫోన్ టవర్లలో 900కి పైగా పనికిరాకుండా పోయాయని నివేదిక‌లు చెబుతున్నాయి. కాగా, అధ్యక్షుడు సిరిల్ రామఫోసా వ‌ర‌ద నష్టాన్ని అంచనా వేయడానికి, ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. 


Similar News