ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులపై సోషియో ఎకనామిక్సర్వే.. పేషెంట్లలో ఆందోళన
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఆసుపత్రులపై ప్రజల్లో ఇప్పటికీ భరోసా పెరగ లేదు.
దిశ, తెలంగాణ బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఆసుపత్రులపై ప్రజల్లో ఇప్పటికీ భరోసా పెరగ లేదు.వైద్యసేవల్లో జాప్యం, సకాలంలో ట్రీట్మెంట్ అందకపోవడం, చికిత్స సమయంలో పేషెంట్లను పట్టించుకోకపోవడం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఆసుపత్రులకు వెళ్లేందుకు జనాలు జంకుతున్నారు. కనీసం ఓపీకి వెళ్లాలంటేనే ఆందోళన చెందే పరిస్థితులు ఉన్నాయంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రుల్లో నిర్వహణ అస్తవ్యస్తంగా మారిపోయింది. టీవీవీపీ పరిధిలోని ఉన్నతాధికారులెవ్వరూ పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ప్రస్తుతం కమిషనర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ రమేష్‌రెడ్డికి నాలుగు హెచ్ఓడీలు పోస్టులు ఉండటంతో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టేందుకు ఆయనకు సమయం లభించడం లేదు. దీంతో క్షేత్రస్థాయి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. తద్వారా పేద పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు పోస్టులు ఉండటం వలన ఆయకు పని ఒత్తిడి కూడా పెరిగింది. దీంతోనే జిల్లా ఆసుపత్రులను పట్టించుకోవడం లేదని స్వయంగా టీవీవీపీ జిల్లా స్థాయి అధికారులే చెబుతున్నారు. టీఆర్ఎస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నదని చెప్పుకుంటున్న లీడర్లు దవాఖాన్ల బాగుపై దృష్టి పెట్టడం లేదు. పెరిగిన పేషెంట్లకు అనుగుణంగా సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ఓపీలు, సర్జరీలు తగ్గాయ్...
రాష్ట్ర వ్యాప్తంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ విభాగానికి 1,53,91,299 మంది రాగా, 2020–21 ఏడాదిలో 77,46,963 మంది మాత్రమే సేవలు పొందినట్లు సోషియే ఎకనామిక్ సర్వే –2022లో పేర్కొన్నారు. అంటే కేవలం 59 శాతం మంది మాత్రమే వచ్చారు. ఇక ఇన్ పేషెంట్లలోనూ అదే పరిస్థితి ఉన్నది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 13,35,694 మంది అడ్మిషన్లు పొందితే 2021–22లో కేవలం 8,18,985 మంది మాత్రమే చేరినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. కేవలం 71 శాతం మంది మాత్రమే అడ్మిషన్లు పొందుతున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులను గమనించినోళ్లంతా ప్రైవేట్‌కు వెళ్లేందుకు మొగ్గు చూపడం విచిత్రంగా ఉన్నది. ఇక 2019–20 ఏడాదిలో 98,990 మేజర్సర్జరీలు జరుగగా, 2020–21లో 78,101 మాత్రమే చేశారు. సరైన పరికరాలు , వైద్యసిబ్బంది , థియేటర్లు, ల్యాబ్ సరిగ్గా లేకనే ఈ పరిస్థితి ఉన్నట్లు స్వయంగా ప్రభుత్వ అధికారులే పేర్కొంటున్నారు.