లాభాల నుంచి నష్టాల్లోకి జారిన సూచీలు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఒడిదుడుకులు తప్పట్లేదు...telugu latest news
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఒడిదుడుకులు తప్పట్లేదు. ఒకరోజు లాభపడిన తర్వాత బుధవారం నాటి ట్రేడింగ్‌లో మరోసారి నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో లాభాల్లోనే కదలాడిన అనంతరం దేశీయంగా ఇంధన ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా మదుపర్లు జాగ్రత్త పడ్డారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అమెరికాతో పాటు గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ పరిణామాలు నష్టాలకు కారణమయ్యాయి. అలాగే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో కొంత ప్రభావం చూపినట్టు నిపుణులు తెలిపారు.
దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304.48 పాయింట్లు కోల్పోయి 57,684 వద్ద, నిఫ్టీ 69.85 పాయింట్లు నష్టపోయి 17,245 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ఫైనాన్స్ రంగాలు 1 శాతం మేర దెబ్బతినగా, మెటల్, ఫార్మా రంగాలు స్వల్పంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో డా. రెడ్డీస్, టాటా స్టీల్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు మెరుగైన లాభాలను దక్కించుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.34 వద్ద ఉంది.