త్వరలో పూర్తిస్థాయిలో డిజిటల్ బ్యాంకుగా ఎస్‌బీఐ 'యోనో'!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులకు..telugu latest news

Update: 2022-03-10 14:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలను అందించేందుకు ప్రస్తుతం ఉన్న 'యోనో' యాప్‌ను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. భవిష్యత్తు అవసరాలకు తగినట్టు దీన్ని 'ఓన్లీ యోనో'గా మారుస్తూ, మెరుగైన సేవలతో పాటు పూర్తి స్థాయిలో డిజిటల్ బ్యాంకుగా తీసుకురానున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రాబోయే ఐదేళ్ల కాలానికి వ్యాపార లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను రూపొందించేందుకు ఓ కన్సల్టెంట్‌ను నియమించాలని భావిస్తున్నట్టు ఎస్‌బీఐ వివరించింది.

మొత్తం 5.4 కోట్ల నెలవారీ యాక్టివ్ యూజర్స్‌ను కలిగి యోనో యాప్ 2021లో 35 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుతం యోనోలో ఉన్న ఈ వినియోగదారులను 'ఓన్లీ యోనో'లోకి మార్చనున్నట్టు బ్యాంకు తెలిపింది. నిరంతర ఆవిష్కరణలతో పాటు వ్యాపార వ్యూహం, కొత్త మార్గాల అన్వేషణ, డిజిటల్ బ్యాంకుగా సమర్థవంతంగా కొనసాగడంపై దృష్టి సారించనున్నట్టు పేర్కొంది. కొత్తగా మారనున్న 'ఓన్లీ యోనో' కొత్త జనరేషన్‌కు చెందిన యాప్‌గా ఉంటుంది. ఇది పూర్తి డిజిటల్ బ్యాంకుగా ఉండనుంది. వినియోగదారులకు అవసరమైన సేవలను అందించేందుకు మరింత విస్తరణ కలిగి ఉంటుందని, వ్యాపార అంచనాలను చేరుకునేందుకు, రిటైల్ విభాగంలో ఇతర బ్యాంకులతో పోటీని కొనసాగించడానికి తగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఎస్‌బీఐ భావిస్తోంది.

Tags:    

Similar News