దిశ, లక్షెట్టిపేట: రాబోయే రోజుల్లో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న రౌడీయిజానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య అన్నారు. లక్సెట్టిపేట ఐబీలో టీఅర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 'ఏవేని కార్యక్రమాలు చేయాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలి తప్ప, ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటిపై అమాయకులను ఉసిగొల్పుతు దౌర్జన్యాలకు పాల్పడడం సరైనది కాద'ని హితవు పలికారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక ఎమ్మెల్యే కుమారుడు విజిత్ రావుపై అసత్య ఆరోపణలు, నిందలు వేస్తూ అప్రజాస్వామిక కార్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దౌర్జన్యాలతో తన గుండాయిజాన్ని ప్రేమ్ సాగర్ రావు బయటపెట్టుకుంటున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే అడ్రస్ గల్లంతవుతుందని హెచ్చరించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. ఈ సమావేశంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, లక్షెట్టిపేట మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు షాహిద్ అలీ, రాజన్న, వికాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.