పెద్దపల్లి జిల్లాలో యథేచ్ఛగా ఆ దందా.. లొసుగులే ఆసరా..
దిశ ప్రతినిధి, కరీంనగర్: అక్కడ రియాల్టర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా..Real estate Mafia in peddapalli
దిశ ప్రతినిధి, కరీంనగర్: అక్కడ రియాల్టర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగుతోంది. ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన తరువాత అందివచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకుని రియాల్టర్లు చేస్తున్న నిలువు దోపిడీ అంతా ఇంతా కాదు. పెద్దపల్లి జిల్లా మంథనిలో సాగుతున్న వెంచర్ల తీరుపై పట్టించుకునేవారే లేకుండా పోయారు. రాష్ట్రమంతటా అమలు చేస్తున్న విధానాన్ని తామూ అమలు చేస్తున్నామని అధికారులు అంటున్నా అటు ప్రభుత్వానికి, ఇటు ప్లాట్లు కొనే యజమానులకు తీరని నష్టం వాటిల్లుతోంది.
ధరణీ పోర్టల్ ఆసరా...
రాష్ట్రంలోని భూముల రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ధరణీ పోర్టల్ ను ప్రారంభించింది. అయితే గతంలో రెవెన్యూ నిబంధనల ప్రకారం గతంలో 10 గుంటల లోపు భూమికి పాసు పుస్తకాలు ఇవ్వకూడదన్న నిబంధన ఉండేది. దీంతో అప్పుడు 10 గుంటలలోపు భూమి క్రయవిక్రయాలు జరిపినా కమర్షియల్ అవసరాల కోసమే జరిగిందని భావించేవారు. అయితే ధరణీ పోర్టల్ ప్రారంభించిన తరువాత ఈ నిబంధనను తొలగించడమే రియల్టర్లకు వరంగా మారిపోయింది. 2 గంటలు కూడా వ్యవసాయ భూమేనంటూ మ్యూటేషన్ చేయిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా దరఖాస్తు దారుల పేర్లను అప్ లోడ్ చేస్తూ వారి క్రయ విక్రయాలను చట్టబద్దం చేస్తున్నారు.
మంథనిలో ఇష్టా రాజ్యం
మంథని పట్టణంతోపాటు సూరయ్యపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లు సామాన్యులను నిట్టనిలువునా ముంచుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సూరయ్యపల్లిలోని ఓ వెంచర్ లో పంచాయితీ ప్రత్యేకంగా ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసింది. చట్ట వ్యతిరేకంగా వెంచర్లు చేపట్టారని ఇందులో ప్లాట్లు కొనడం అమ్మడం నేరమని, 2018 పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే మంథని పట్టణంలోని నిర్వహిస్తున్న వెంచర్ ను నిలువరించేవారే కరువయ్యారు. దీంతో రియాల్టర్లు సామాన్యుని ఆశలే పెట్టుబడిగా దందా కొనసాగిస్తున్నారు.
నష్టం ఎవరికీ..?
రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిట భూమి నమోదు అవుతున్నప్పటికీ దానిని కొనుగోలు చేసిన సామాన్యులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు వ్యవసాయ భూమిగా చూపిస్తూ కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇళ్లు కట్టాలంటే రెగ్యూలరైజేషన్ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. డెవలప్ మెంట్ ఫీజు వంటివి చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు రియల్టర్లు పాట్ల మధ్యలో వేస్తున్న అంతర్గత రోడ్ల విషయంలోనూ నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. డీటీసీపీ నిబంధనల ప్రకారం 300 ఫీట్ల నుండి ఆపై పొడవు ఉన్న రహదారికి 40 ఫీట్లు, ఆలోపు పొడవున్న రోడ్లకు 33 ఫీట్ల వెడల్పు ఉన్న రోడ్లు వేయాల్సి ఉంటుంది. కానీ ఈ వెంచర్లలో ఇంతకు తక్కువగానే రోడ్లను వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న ఈ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఇంటి నిర్మాణం చేసుకున్న సమయంలో ఖచ్చితంగా రోడ్డు కోసం కొంత స్థలాన్ని వదిలేయాల్సిన పరిస్థితి లేకపోలేదు. అప్పుడు ప్రభుత్వం నిర్ణయించి విధించే ట్యాక్సులను, ఫెనాల్టీలను ఖచ్చితంగా కడితేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తారు.
వ్యవసాయం కోసమే అయితే రోడ్టేందుకు...?
వ్యవసాయ అవసరాల కోసమే భూముల క్రయవిక్రయాలు సాగించినట్టయితే రోడ్లు ఎందుకు నిర్మిస్తున్నారన్న విషయాన్ని మాత్రం అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. వ్యవసాయ భూముల్లో ఎకరాల్లో ఉన్న భూముల మధ్య దారులు ఉంటాయి. కానీ ఈ వెంచర్లలో మాత్రం గుంటల స్థలాల్లోనే రోడ్లు వేస్తున్నారంటే కమర్షియల్ అవసరాల కోసం కాదని రియాల్టర్లు చెప్పడం అధికారులు నమ్మడం అత్యంత విచిత్రంగా ఉందని అంటున్నారు.
సర్కారుకూ శఠగోపం..
ఇకపోతే డీటీసీపీ అప్రూవల్ లే ఔట్లు లేకుండా సాగుతున్న ఈ తతంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది. అక్రమ లే ఔట్లతో సాగుతున్న ఈ దందా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కమర్షియల్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం, కోల్పోవడమే కాకుండా 10 శాతం భూమి కమ్యూనిటీ అవసరాలకు మిగల్చకుండా, 15 శాతం భూమిని మార్ట్ గేజ్ చేయకుండా అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల రానున్న కాలంలో అక్కడ ఇంటి నిర్మాణాలు జరిగితే సర్కారు నిధులతోనే సౌకర్యాలు కల్పించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం రాకుండా పోవడమే కాకుండా ముందు వాటిల్లో సౌకర్యాల కల్సన కోసం డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది.
చర్యలు తీసుకోండి: ఇనుముల సతీష్
వ్యవసాయ భూముల ముసుగులో సాగుతున్న రియల్ దందాపై కొరడా ఝులిపించాలి. మంథని, సూరయ్యపల్లిల్లో ఏర్పాటు చేసిన వెంచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేనట్టయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. సామాన్యులు కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.