ఎలక్ట్రిక్ వెహికల్‌‌గా సామాన్యుడి కలల కారు 'నానో'!

Update: 2022-02-11 10:13 GMT

దిశ, ఫీచర్స్ : మధ్యతరగతి కలలకు ప్రతిరూపంగా.. రతన్ టాటా సంకల్ప బలంతో.. లక్ష రూపాయల్లో రూపొందించిన కారు 'నానో'. 2008లో తొలిసారి ఢిల్లీ ఆటో షోలో ప్రదర్శించబడిన కారు అమ్మకాలు తర్వాతి ఏడాది మార్చి నుంచే మొదలయ్యాయి. అయితే అత్యంత చౌకైన కారు గా పేరొందినా.. అంచనాలు అందుకోలేక కాలక్రమంలో కనుమరుగైంది. అలాంటి నానో కారు EV గా మళ్ళీ రాబోతుందా? ఇందుకు రతన్ టాటా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడా? సామాన్యుడి కలలకు నానో రెక్కలు తొడగనుందా? అంటే నిజమే అనిపిస్తోంది.

'ఎలక్ట్రోడ్రైవ్ పవర్‌ట్రైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లేదా Electra EV' అనేది భారత్‌లోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల పవర్‌ట్రైన్ సొల్యూషన్స్ కంపెనీ. ఇండియాలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఫ్యూచర్‌ను వేగవంతం చేయడంపై దృష్టి సారించిన కంపెనీని రతన్ టాటానే ప్రారంభించారు. ఇది ఆసియా మార్కెట్ల కోసం ఆప్టిమైజ్ చేసిన EV పవర్‌ట్రైన్ సొల్యూషన్స్ ప్రారంభించేందుకు Electra EV గ్లోబల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రొవైడర్స్‌తోనూ పనిచేస్తుంది. ఎలక్ట్రా ఈవీ హెడ్‌క్వార్టర్ పుణె కాగా.. కోయంబత్తూర్‌లో వెహికల్స్ మాన్యుఫ్యాక్చర్ జరుగుతోంది. ప్రస్తుతానికి Electra EV.. Nexon EV, Tigor EV పేరుతో రెండు ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లను అందిస్తుండగా కస్టమ్ మేడ్ ఎలక్ట్రిక్ నానో ఫొటోను ఇటీవలే పోస్ట్ చేసింది. అంతేకాదు టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా, అతని సహాయకుడు శంతను నాయుడు ఈ కార్లోనే ప్రయాణించడం విశేషం.

'కస్టమ్-బిల్ట్ 72V నానో EV లో మా వ్యవస్థాపకుడు ప్రయాణించడం కంపెనీకి నిజంగా గ్రేట్ మూమెంట్! నానో EVని అందించడం, మిస్టర్ టాటా నుంచి అమూల్యమైన ఫీడ్‌బ్యాక్, ఇన్జసైట్స్ పొందడం మాకు చాలా గర్వంగా ఉంది' అని పేర్కొంటూ Electra EV పోస్ట్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు పనితీరును మెచ్చుకుంటూ ఇదే పోస్ట్ కింద పోస్టు చేసిన శంతను నాయుడు 'ఇది డ్రైవ్ చేసిన దానికంటే ఎక్కువ గ్లైడ్. గుడ్ వర్క్' అని రాశారు.

'టాటా నానో ఎలక్ట్రిక్‌ను ఉత్పత్తిలోకి తీసుకొస్తే విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. మేము NEXON EV, TIGOR EV ల విజయాన్ని చూశాం. సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపగలిగే చిన్న సిటీ ఎలక్ట్రిక్ కారును అందరూ కోరుకుంటారు. నానో దీనికి సరిగ్గా సరిపోతుంది. నడపడం సులభం, పార్క్ చేయడం మరింత సులభం' అని నెటిజన్లు కామెంట్స్ చేశారు. అయితే ఎలక్ట్రిక్ కార్లు అభివృద్ధి చెందాలంటే, ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్స్, విద్యుత్తుతో నడిచే వాహనాలకు మెరుగైన పన్ను రాయితీలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం చొరవ చూపించాలని నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News