జగదేవపూర్‌లో కేజీ టు పీజీ కాలేజీకి కృషి: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి

Update: 2022-02-16 12:49 GMT

దిశ, జగదేవపూర్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో నిస్వార్థ ప్రజా నాయకుడు, జగదేవపూర్ గాంధీ గా పిలువబడే ఆదరాసుపల్లి నరసింహ రామయ్య పంతులు కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రమణాచారి బుధవారం ఆవిష్కరించారు. ముందుగా జగదేవపూర్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగదేవపూర్ మండల కేంద్రంలో కేజీ టు పీజీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని రమణాచారి పేర్కొన్నారు.




నిస్వార్థ సేవలు ప్రజల గుండెల్లో నుంచి ఎప్పటికీ చెరిగిపోవన్నారు. నరసింహ రామయ్య పంతులు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. స్వార్థం లేకుండా నిస్వార్ధంగా గ్రామ అభివృద్ధికి సేవలందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. నేటి యువతరం రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎప్పటికీ పదవులు, మనుషులు శాశ్వతం కాదని, చేసే పనులే జీవితంలో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు.

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News