Rahul Gandhi: ఏఐసీసీ భారీ ప్లాన్.. టీ కాంగ్రెస్‌‌పై రాహుల్ గాంధీ స్పెషల్ ఫోకస్!

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్​పార్టీ- Latest Telugu News

Update: 2022-04-11 00:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్​పార్టీ.. అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల 39 మంది నేతలతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌తో​భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒక్కొక్కరుగా పార్టీ నేతలు రాహుల్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ రేవంత్ తీరుపైనే ఆరోపణలకు దిగుతున్నారు. అయితే, రేవంత్​ నాయకత్వంపై రాహుల్​నమ్మకం చూపిస్తూ వారిని బుజ్జగించే బాధ్యతలను సైతం ఏఐసీసీ పెద్దలకు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ కోమటిరెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్​పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఎన్నికలు లేకున్నా.. ఈ స్టార్​క్యాంపెయినర్​ప్రకటన ఎందుకనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

గతంలోనూ అంతే..

రాష్ట్ర కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇవి మరింత ముదురుతున్నాయి. కొంతమందిని బుజ్జగించేందుకు పార్టీ తరుపున నేతలకు పదవులు ఇస్తూనే ఉన్నారు. గతంలో కూడా ఎన్నికల వేళ నేతలు తలోదారి వెళ్తుండటంతో.. కాంగ్రెస్​ పార్టీ పలు కమిటీలతో సీనియర్లకు బాధ్యతలిచ్చారు. ప్రచార కమిటీకి ఛైర్ పర్సన్‌గా విజయశాంతిని నియమించి, 19 మందిని సభ్యులుగా చేర్చింది. అదే సందర్భంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో పబ్లిసిటీ కమిటీని ఏర్పాటు చేసి అందులో 15 మందిని సభ్యులుగా నియమించారు. మీడియా కమిటీ పేరుతో మధు యాష్కి సారథ్యంలో మరో కమిటీ వేసి అందులో ఐదుగురు సభ్యులను ఉంచారు. ఇక ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ వేసి, అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా చైర్మన్‌గా, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్వీనర్‌గా ఏకంగా 35మంది సభ్యులతో ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్​ఎన్నికల కోసం జంబో కమిటీ అని ప్రయోగం చేసిన కాంగ్రెస్​ ఆ కమిటీ ఏం పని చేయలేదనే ఆరోపణలు కూడా మూటగట్టుకుంది.

కోమటిరెడ్డి బ్రదర్స్​ కోసం కమిటీ..

గతేడాది సెప్టెంబర్‌లో టీపీసీసీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని నియమించిన ఏఐసీసీ.. అప్పటికే అసంతృప్తులుగా ముద్రపడిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ను చేర్చింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​మాణిక్కం ఠాగూర్ ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో పార్టీ పట్ల అసంతృప్తితో అలకబూనిన కోమటిరెడ్డి సోదరులకు చోటు కల్పించడం విశేషం. అయినప్పటికీ.. ఏదో ఓ సందర్భంలో వివాదాలకు దిగుతూనే ఉన్నారు. తాజాగా రాష్ట్రంపై దృష్టి పెట్టిన రాహుల్​గాంధీ.. అసంతృప్తులను పదవులతో బుజ్జగిస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీనిలో భాగంగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి ఇప్పుడు స్టార్​క్యాంపెయినర్​అంటూ హోదా ఇచ్చారు. అదేవిధంగా త్వరలో రాష్ట్ర స్టీరింగ్​కమిటీ కూడా ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది.

Tags:    

Similar News