రంగంలోకి రాహుల్ గాంధీ.. సెట్ అయిన టీ-కాంగ్రెస్ నేతలు!

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్​నేతలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తెలంగాణను నిన్నటి వరకు ఎంతో కొంత లైట్‌గా తీసుకున్న ఏఐసీసీ ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది.

Update: 2022-03-29 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్​నేతలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తెలంగాణను నిన్నటి వరకు ఎంతో కొంత లైట్‌గా తీసుకున్న ఏఐసీసీ ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. గతవారం కిందటే రాష్ట్రానికి చెందిన పార్టీ వ్యవహారాలన్నింటిపైనా టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డికి ఫుల్​పవర్స్​ఇవ్వడంతో పార్టీ సీనియర్లలో కొంత మార్పు తీసుకువచ్చింది. వారం కిందట వరకు ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరించడమే కాకుండా పదేపదే విమర్శలకు దిగిన వారంతా సైలెంట్​అయ్యారు. అంతేగాకుండా టీపీసీసీ జూమ్​మీటింగ్‌కు సైతం కొంతకాలంగా దూరంగా ఉంటున్నవారంతా హాజరయ్యారు. తాజాగా.. రాష్ట్ర రాజకీయాలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్​చేస్తూ ఆయన చేసిన ట్వీట్‌తో కాంగ్రెస్​ నేతలు వరుసగా ఎదురుదాడికి దిగారు.

కలిసే ఉంటున్నాం

కాంగ్రెస్‌లో కలహాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. ఏదో ఓ సందర్భంలో ఎవరో ఒక నేత వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి నియామకం తర్వాత ఈ వివాదాలు మరింత పెరిగాయి. కాంగ్రెస్‌లోని సీనియర్లంతా వ్యతిరేకమయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో కొంతమంది అనుకూలంగా మారారు. కానీ, ఇటీవల జగ్గారెడ్డి, వీహెచ్, మర్రి శశిధర్​రెడ్డి వంటి నేతలు బహిరంగ విమర్శలకు దిగగా.. ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, మధుయాష్కీ, గీతారెడ్డి, పొన్నంతో సహా పలువురు నేతలు దూరంగా ఉంటున్నారు. ఈ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్లకు చెక్​ పెడుతూ రేవంత్​పైనే భారం వేసింది. ఈ పరిణామాలు సీనియర్లకు షాక్​ఇచ్చాయి. ఏఐసీసీ నేతలను కలిసేందుకు ప్రయత్నాలు చేసినా.. అక్కడి అపాయింట్​మెంట్​ రాలేదు. ఈ నేపథ్యంలో సీనియర్లు ఒక్కొక్కరుగా సైలెంట్​అయ్యారు. విమర్శలు చేసిన వారంతా ప్రస్తుతానికి కలిసి ఉంటామనే సంకేతాలిచ్చారు. ఇటీవల టీపీసీసీ నిర్వహించిన జూమ్​సమావేశాలకు గతంలో హాజరుకాని నేతలంతా హాజరయ్యారు. అయితే, గాంధీభవన్​సమావేశాలకు మాత్రం ఇంకా వెళ్లడం లేదు. బహిరంగ సభలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒక విధంగా పంటికిందే అసంతృప్తిని దాచి పెట్టుకుంటున్నారు. ఏఐసీసీ నుంచి సీరియస్​వార్నింగ్​రావడంతో ఇప్పుడు మాత్రం ఒకరి వెంట ఒకరం ఉంటామనే సంకేతాలిస్తున్నారు.

ఎండ్రికాయల కథేనా?

అసలు కాంగ్రెస్​పార్టీ.. ఎప్పుడు ఏ నేత ఎలా మాట్లాడుతారో తెలియని పరిస్థితి సాధారణమే. అయితే, ప్రస్తుతం ఏఐసీసీ వార్నింగ్‌లతో సైలెంట్​మోడ్‌లో ఉంటున్న నేతలు.. మళ్లీ ఎప్పుడు తిరుగుబాటు జెండా ఎగురవేస్తారో అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గతంలో కూడా ఇలాంటి పరిస్థితులే ముందుకొచ్చాయి. వీహెచ్, జగ్గారెడ్డి వంటి నేతలు రేవంత్​రెడ్డి వెంట ఉన్నామంటూనే వ్యతిరేకంగా విమర్శలకు దిగారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కూడా కాంగ్రెస్‌లో ఎక్కువే. ఈ పరిస్థితి కొనసాగుతుందా.. లేకుంటే పార్టీని పునర్​ వైభవం కోసం అంతా కలిసి పని చేస్తారా? అనేది ఇంకా సందేహంగానే మారింది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని భావిస్తున్న కాంగ్రెస్​పార్టీ.. వచ్చే ఎన్నికల నాటికి కలిసికట్టుగా పని చేస్తే అధికారంలోకి రావచ్చనే అంచనాలతో ఉంది. కానీ, నేతలు కలిసిరాకపోవడంతో మళ్లీ పాత కథే అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందనేది పార్టీ వర్గాల్లో కొంత ఆందోళన కూడా నెలకొంది.

రంగంలోకి రాహుల్

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనూ విమర్శలు ఎదుర్కొంది. ఇలాంటి సమయంలో తెలంగాణ వ్యవహారం ఏఐసీసీ నేతలను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో ఎంపీలు, సీనియర్లకు హెచ్చరికలిచ్చింది. ప్రస్తుతం తెలంగాణపై ఏకంగా రాహుల్​గాంధీ కన్నేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని చూపిస్తూ ఆయన చేసిన ట్వీట్​.. రాష్ట్రంలో వైరల్‌గా మారింది. రాహుల్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ ఆయనకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్​ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. అటు టీఆర్ఎస్ కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తుంటే.. అదేస్థాయిలో కాంగ్రెస్​ నేతలు రిప్లై ఇస్తున్నారు. మంగళవారం మొత్తం సోషల్​మీడియాలో ఇదే యుద్దం సాగింది. అయితే, వచ్చేనెలలో రాష్ట్రానికి రాహుల్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామంటూ సోమవారం జరిగిన టీపీసీసీ జూమ్ మీటింగ్‌లో రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. దాదాపుగా ఆరు నెలల నుంచే రాహుల్‌ను తెలంగాణకు రావాలంటూ కాంగ్రెస్​ నేతలు ప్రయత్నిస్తున్నా.. వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు రాహుల్​గాంధీని తీసుకువస్తే పార్టీ శ్రేణుల్లో ఊపు వస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం రాహుల్​ట్వీట్​రాష్ట్రంలోని కాంగ్రెస్​శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడంలో పార్టీ వర్గాలు మొత్తం కలిసి రావాలని టీపీసీసీ తీర్మానం చేయడమే కాకుండా.. అందరికీ సమాచారం పంపించింది. దీనిపై ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు మాజీ పౌరసరఫరాల శాఖ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో పలువురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను పరిరక్షించే జీవో 111 విషయంలో అధ్యయనం చేయాలని మొన్నటిదాకా టీపీసీసీపై అసంతృప్తి వ్యక్తం చేసిన మర్రి శశిధర్​రెడ్డితో పాటు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శ్రవణ్​తో కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

Tags:    

Similar News