పుతిన్‌కి మేజర్ షాక్.. దేశం వదిలిపెట్టిన దోస్త్
కీవ్: ఉక్రెయిన్ యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ..telugu latest news
కీవ్: ఉక్రెయిన్ యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి పిడుగుపాటు తగిలినట్లయింది. ఉక్రెయిన్‌లో పుతిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న చిరకాల మిత్రుడు, రష్యా పర్యావరణ రాయబారి అనతోలి చుబాయిస్ పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. అనతోలి చుబాయిస్ 1990లలో పుట్టుకొచ్చిన ఆర్థిక సంస్కర్తల్లో ఒకరు. ఈయనకు పాశ్చాత్య అధికారులతో సన్నిహిత సంబంధాలుండేవని ప్రతీతి. 1990ల మధ్యలో క్రెమ్లిన్‌లో తొలి పదవిని పుతిన్‌కి ఇవ్వడంలో సాయపడిన అనతోలి చుబాయిస్ ఆ దశాబ్దం చివరికి క్రెమ్లిన్ పీఠాన్ని చేరుకోవడాన్ని స్వాగతించారు కూడా.
66 సంవత్సరాల వయసున్న చుబాయిస్, పుతిన్ హయాంలో పలు ప్రభుత్వ కంపెనీలలో ఉన్నత పదవులు చేపట్టారు. గత సంవత్సరం తనను స్వావలంబనతో కూడిన అభివృద్ధి శాఖకు రాయబారిగా పుతిన్ నియమించారు. కాగా మంగళవారమే చుబాయిస్ తన రాజీనామాను ప్రకటించినట్లు తెలుస్తోంది. రష్యా ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ద్మిత్రీ మెద్వదేవ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీనియర్ సలహాదారుగా వ్యవహరించిన అర్కాడే ద్వోర్కోవిచ్ గతవారమే పదవులకు రాజీనామా చేసి షాక్ కలిగించారు. ఇక సన్నిహితుడైన చుబాయిస్ కూడా రాజీనామా చేసి దేశం నుంచి వెళ్లిపోవడం పుతిన్‌కి పిడుగుపాటేనని భావిస్తున్నారు.