తుగ్లక్ రోడ్ బంగళాలో కేసీఆర్-పీకే భేటీ.. మూడ్రోజులపాటు మంతనాలు

ప్రశాంత్ కిషోర్ @పీకే.. టీఆర్ఎస్ వ్యూహకర్తగా ఇకపై తెలంగాణ రాజకీయాలకే పరిమితం కానున్నారు. వైద్యం కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. మూడు రోజుల పాటు పీకేతో ఏకాంతంగా సమావేశమయ్యారు.

Update: 2022-04-08 03:53 GMT

ప్రశాంత్ కిషోర్ @పీకే.. టీఆర్ఎస్ వ్యూహకర్తగా ఇకపై తెలంగాణ రాజకీయాలకే పరిమితం కానున్నారు. వైద్యం కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. మూడు రోజుల పాటు పీకేతో ఏకాంతంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి.. తిరిగి అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహంపైనే వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఇక జాతీయస్థాయిలో పీకేకు కాంగ్రెస్ తో ఒప్పందం జరిగినట్టు తెలిసింది. నేషనల్ పాలిటిక్స్ లో వ్యూహాలను ఖరారు చేయాల్సి వస్తే తెలంగాణ, కర్ణాటకను అందులోంచి స్కిప్ చేస్తారని సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఈ నెల 3న ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. తుగ్లక్ రోడ్డులోని తన బంగళాలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో 3 రోజుల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఆ సమయంలో టీఆర్ఎస్ ఎంపీలను సైతం అక్కడికి రానివ్వలేదు. వారిద్దరు మాత్రమే చర్చించుకున్నారు. జాతీయ రాజకీయాల కన్నా రాష్ట్రంపైనే వీరి ఫోకస్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లడుకున్నట్టు తెలిసింది. గతంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో ప్రకాశ్‌రాజ్‌తో కలిసి జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపిన కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు పీకేపైనే వీలైనంత ఎక్కువగా ఆధారపడాలని టీఆర్ఎస్ భావిస్తున్నది. క్షేత్రస్థాయిలోని పార్టీ పరిస్థితిని శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి విశ్లేషించడంలో పీకేకు ఉన్న అనుభవమే ఇందుకు కారణమని ఓ ఎంపీ పేర్కొన్నారు. ఇప్పటివరకూ టీఆర్ఎస్‌కు వేర్వేరు సర్వే సంస్థలు, కొన్ని ప్రైవేటు టీవీ ఛానెల్స్ టీఆర్ఎస్ తరఫున అధ్యయనం చేస్తున్నాయి. ఆ నివేదికలను స్వయంగా కేసీఆర్ విశ్లేషిస్తూ తదనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ విషయాన్ని పలు సందర్భాల్లో మీడియాకు వివరించారు. థర్డ్ పార్టీ ఒపినియన్‌గా పీకే బృందాలు సేకరించే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు డీల్ కుదుర్చుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే పీకేతో ఇటు రాష్ట్ర, అటు దేశ రాజకీయాలకు సంబంధించి భారీ ప్యాకేజీతో ఒప్పందం కుదరనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

గతేడాది పశ్చిమబెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏడాది పాటు ఏ పార్టీతోనూ ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోనని గతంలో పీకే స్పష్టం చేశారు. ఆ ప్రకారం వచ్చే నెల 2వ తేదీ నాటికి ఆయన పెట్టుకున్న గడువు పూర్తికానున్నది. ఆ తర్వాత ఏ పార్టీతో ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంటారన్నది తేలిపోనున్నది. ఈ గడువు ముగియక ముందే కేసీఆర్‌తో మూడు రోజులపాటు సుదీర్ఘంగా చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లేదా ఢిల్లీ బంగళాను ఎంచుకుంటారు. ఇప్పుడు పంటి చికిత్స కోసం ఆదివారం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ పీకేతో సానుకూల వాతావరణంలో చర్చలు జరపడం గమనార్హం. ఇంకా ఒకటి రెండు రోజులపాటు కేసీఆర్ అక్కడే ఉండాలనుకుంటున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రధానిని కలుస్తారని, ఢిల్లీలో ఈ నెల 11న జరిగే నిరసన దీక్షలో పాల్గొంటారని తొలుత సమాచారం వచ్చింది. కానీ అపాయింట్‌మెంట్ కోసం ఎలాంటి విజ్ఞప్తి రాలేదని పీఎంవో వర్గాల సమాచారం. నిరసన దీక్షలో సైతం ఆయన పాల్గొనరని, కేటీఆర్ మాత్రమే హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

జాతీయ స్థాయి సేవలు కాంగ్రెస్ కే!

కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో వ్యూహకర్తగా పీకే దాదాపుగా ఖరారైనట్లు ఏఐసీసీ నేతలు పేర్కొన్నారు. దీనికి సంబంధించి రాహుల్‌గాంధీతో, ప్రియాంకాగాంధీతో మీటింగులు కూడా పూర్తయినట్లు తెలిపారు. వచ్చే నెల రెండో వారంలో లాంఛనంగా జరగాల్సిన కసరత్తు ఉంటుందన్నారు. మరోవైపు కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం సునీల్ కనుగోలు సేవలను వినియోగించుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో పీకేతో కలిసి పనిచేసి ఇప్పుడు స్వంతంగా సంస్థను ఏర్పాటుచేసుకున్న సునీల్ కేవలం ఈ రెండు రాష్ట్రాల వ్యవహారాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. పీకేతో కాంగ్రెస్ కుదుర్చుకునే ఒప్పందం కేవలం జాతీయ స్థాయికి మాత్రమే పరిమితమవుతుందని, రాష్ట్రాల్లో కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు అనివార్యమైతే ఈ రెండు రాష్ట్రాలను స్కిప్ చేస్తారని ప్రాథమిక సమాచారం. కాంగ్రెస్‌తో ఒప్పందాన్ని కుదర్చుకుంటున్నందున నేషనల్ పాలిటిక్స్ అంశంలో టీఆర్ఎస్‌తో పీకే మరో ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలు లేవు. కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉన్నది.

రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నందున ఏక కాలంలో పీకే, సునీల్ ఈ రెండు పార్టీలతో కుదుర్చుకునే ఒప్పందాలు ఎలాంటి చిక్కులకు దారితీస్తాయోననే సందేహాలూ లేకపోలేదు. ఇప్పటివరకూ పీకే సాయంతో కొన్ని బృందాలు జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు ఫీడ్ బ్యాక్ అందించాయి. రాజ్యాంగ సవరణ, అంబేద్కర్ చేసిన కృషి, జాతీయ రాజకీయాల్లో బలమైన ప్రత్యామ్నాయ శక్తి అవసరం తదితర అంశాల్లో వివిధ పార్టీల, ప్రజా సంఘాల అభిప్రాయాలను కేసీఆర్‌కు పీకే బృందాలు అందించాయి. నేషనల్ పాలిటిక్స్ లో పోషించాల్సిన పాత్రకు సంబంధించిన అంశం కావడంతో ఆ అవసరాలకు పీకే సాయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి మాత్రమే ఫోకస్ షిప్టు చేసి పీకే సర్వీసును వాడుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత పీకే, కేసీఆర్ మధ్య చర్చలు, టీఆర్ఎస్‌తో కుదిరే ఒప్పందం తదితరాలపై కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన సర్వేకు సంబంధించిన వివరాలు అందాయని, తొందర్లోనే మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్ల డాటా కూడా అందుతుందంటూ స్వయంగా సీఎం ఈ మధ్య మీడియా సమావేశంలో వెల్లడించారు. దీంతో పీకే సేవలను రానున్న అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్ఎస్ వాడుకోవడం దాదాపుగా ఖరారైనట్లే. మే సెకండ్ వీక్‌లో పూర్తి స్పష్టత రానున్నది.

Tags:    

Similar News