హత్య కేసులో నిందితుడి అరెస్ట్

వేములవాడ పట్టణంలో ఈనెల 18న జరిగిన డాక్యుమెంట్ రైటర్ రషీద్ హత్య కేసును వేములవాడ పోలీసులు ఛేదించారు.

Update: 2024-12-21 16:06 GMT

దిశ, వేములవాడ : వేములవాడ పట్టణంలో ఈనెల 18న జరిగిన డాక్యుమెంట్ రైటర్ రషీద్ హత్య కేసును వేములవాడ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం రాత్రి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సాయినగర్ కు చెందిన నూనె మనోహర్ అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లగా అదే ప్రాంతంలో నివాసం ఉండే మహమ్మద్ రషీద్ అనే డాక్యుమెంట్ రైటర్ తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని భావించి రషీద్ ను ఎలాగైనా చంపాలని భావించాడు.

    ఈ క్రమంలో 45 రోజుల క్రితం గల్ఫ్ నుండి వచ్చిన మనోహర్ గత కొద్ది రోజులుగా రషీద్ కదలికలను గమనిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18న ఉదయం రషీద్ ఉన్న ప్రాంతానికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టే కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, సీఐలు వీర ప్రసాద్, శ్రీనివాస్, ఎస్సైలు రమేశ్, మారుతీలు బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలించారు.

     ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మల్లారం రోడ్డులో కనిపించగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి హత్యకు వినియోగించిన కత్తి, ఫోన్, పాస్పోర్ట్ తో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా హత్య కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీఐలను, ఎస్ఐలను, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. 


Similar News