అప్పుడే మొదలైన ఎమ్మెల్యేల పంచాయతీ.. ఎన్నికలోస్తాయంటూ విస్తృత పర్యటనలు
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంతో.. Latest Telugu News..
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంతో ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశపడే నేతలు కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. ప్రతి రోజు ఆయా నియోజకవర్గాల్లోని ఏదో ఒక గ్రామంలో సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున్న చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులను ఆహ్వానించి అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనల వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో హోరాహోరీగా ఆశావాహులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో తమదైన ముద్ర వేసుకోవాలనే భావనలో నాయకులున్నట్లు స్పష్టమైతుంది.
అధికార పార్టీపై నిరసన గళం విప్పేది వాళ్లే..
రంగారెడ్డి జిల్లాలోని 8, వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో పోటీ చేసే ప్రముఖులు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంతాలపై కొత్తవాళ్లు కన్నేసినట్లు విశ్వసనీయ సమాచారం. వికారాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆశవాహులు అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాలో పూర్తిగా కొత్త వాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పాత, కొత్త కలయికలతో పాటు నూతన నాయకత్వం ప్రమోట్ చేస్తే పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. ఇందులోనే స్థానిక, స్థానికేతర, కుల సమీకరణాలతో నూతన నాయకత్వానికే పార్టీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే ప్రచారం సాగుతోంది.
ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తెలివైన వాళ్లు, ప్రజా సమస్యలపై పట్టున్న వ్యక్తులే అయినప్పటికి యువతను ఆకర్షించే స్ధాయిలో లేరనే అపవాదు ఉంది. అంతేకాకుండా వయస్సు భారం, అత్యధిక అనుభవమున్న నేతలు బరిలో నిలిచిపోవడం ఇష్టం లేకపోవడంతో నూతన నాయకత్వానికే ఎమ్మెల్యే అవకాశలు ఇవ్వాలన్న భావన అధిష్టానంలో ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే పాత వాళ్లందరికి ఎమ్మెల్యే టికెట్లు దక్కవని స్పష్టమవుతోంది. నియోజకవర్గాల్లోని కొంత మంది ఎమ్మెల్యే పై భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలుండగా, మరికొంత మంది ఎమ్మెల్యేపై ప్రజలకు సానుభూతి ఉన్నప్పటికి ప్రయోజనం లేదని తెలుస్తోంది.
తాండూర్లో తానంటే తానంటున్న నేతలు..
వికారాబాద్ జిల్లా తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పట్నం వర్సెస్ పైలట్ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రతి రోజు ఇద్దరు నేతలు హైదరాబాద్ నుంచి వచ్చి నియోజకవర్గంలో రెండు రోజులు ఉండటం హల్చల్ చేసిపోవడం అలవాటుగా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని, ఇదే టీఆర్ఎస్ పార్టీ ద్వారానే గెలుస్తానని స్పష్టం చేశారు. ఈ విషయం విన్న ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జీర్ణించుకోలేక గ్రామాల్లో చక్కర్లు కొడుతున్నారు. మంచి, చెడు కార్యక్రమాలకు సంబంధం లేకుండా ప్రతి నిత్యం ప్రజల్లో ఉండేందుకు తాపత్రయపడుతున్నారు. వీరు ప్రతిపక్ష పార్టీతో పోటీపడే కంటే పాలక పక్షంలోనే ప్రత్యార్ధులుండటంతో ఆ నియోజకవర్గం ప్రజల్లో జోషు మొదలైయింది.
చేవెళ్ల ఎమ్మెల్యే పై కే.ఎస్ రత్నం ఆరోపణలు..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల రగడ మొదలు కావడంతో ఇద్దరు నేతల మధ్య వైరం బహిర్గతమవుతుంది. ఇద్దరు అధికార పార్టీకి చెందిన నేతలైనప్పటికి ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. గత 10 రోజుల కింద అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కే.ఎస్ రత్నం ఇప్పటి వరకు స్థబ్ధతగా కనిపించి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై అవినీతి, అక్రమాలున్నాయని విమర్శించడంతో ఒక్కసారిగా గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. తాను ఎమ్మెల్యే రేసులో ఉన్నానని పరోక్షంగా ప్రచారం చేసుకునేందుకు కే.ఎస్ రత్నం కాలే యాదయ్యపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా కే.ఎస్ రత్నం ప్రతి రోజు ప్రజల్లో ఉండేందుకు ఏదో ఒక కార్యక్రమం ఎంచుకొని పనిచేస్తున్నారు. ఈ ధఫా తమకే టికెట్ దక్కుతుందని అనుచరులకు సిగ్నల్స్ ఇస్తున్నారు. ఈ విధంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో రోజు రోజుకు రాజకీయ వేడెక్కుతుంది.