దిశ, నారాయణఖేడ్: ఓ పక్క గంజాయి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంటే ధనార్జనే ధ్యేయంగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ ప్రజా ప్రతినిధులు అడ్డంగా బుక్ అవుతున్నారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నారాయణఖేడ్ మండలం చందర్ నాయక్ తండా సర్పంచ్ బానోత్ పుండ్లిక్‌ను సూర్యాపేట జిల్లా చిట్యాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విశాఖపట్నం జిల్లా సరిహద్దులో ఒరిస్సా నుండి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న తరుణంలో సూర్యాపేట జిల్లాలో పోలీసులు పట్టుకున్నట్టు నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్ రెడ్డి వివరించారు. నారాయణఖేడ్ మండలంలోని చందర్ నాయక్ తండా సర్పంచ్‌గా బానోత్ పుండ్లిక్ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో చందర్ నాయక్ తండ సర్పంచ్ బానోత్ పుండ్లిక్ మరియు ఖేడ్ మండలంలోని హంగిర్గ గ్రామానికి చెందిన బానోత్ రమేష్ , బానోత్ శాంతికుమార్‌లతో పాటు మరో ఆరుగురు ఒరిస్సా ప్రాంతం నుండి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సూర్యాపేట జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామం వద్ద పంజాబీ దాబాలో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈసందర్భంగా నారాయణఖేడ్ ఎస్ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నిషేధిత గంజాయిని సాగు చేసినా , అక్రమ రవాణా చేసినా ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు.