దిశ, ఎల్బీనగర్ : క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ గ్రీన్ మిడోస్‌లో నివాసం ఉండే చక్రవర్తి గోవా, బెంగుళూరు, హైదరాబాద్‌లలో పెద్ద ఎత్తున రూ.కోట్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందింది. దాంతో ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మాచ్ జరుగుతుండగా రైడ్ చేశారు. ప్రధాన ఆర్గనైజర్ చక్రవర్తితో పాటు మరో నలుగురు హరీష్, సరేష్‌రెడ్డి, సామ జైపాల్‌రెడ్డి, షేక్ ఆసీఫ్ పాషలను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు అప్పలరాజు, శ్రీనివాస ఉదయ్ కుమార్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చక్రవర్తి వృత్తి రిత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి. విలాసాల కోసం డబ్బులు సులువుగా సంపాదించడానికి ఐపీఎల్ వంటి మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడని, పలు మార్లు క్రికెట్ బెట్టింగ్ కేసులో పట్టుబడి జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.12.50 లక్షల నగదుతో పాటు అకౌంట్‌లో ఉన్న రూ.90 లక్షల నగదును సీజ్ చేసిన పోలీసులు.. ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, 7 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందింతులు క్రికెట్ మజ్జా అనే ఆన్‌లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ నడిపేవారని, ఆ సమయంలో లావాదేవీలకు ఉపయోగించే రెండు అకౌంట్‌లు వేంటకేశ్వర ట్రేడర్స్, లక్ష్మీదుర్గా ట్రేడర్స్ పేరుతో కరెంట్ అకౌంట్‌లు తీయడం ద్వారా పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు వెల్లడించారు. ఎవరైనా బెట్టింగ్‌లో పాల్గొనాలనుకుంటే ముందుగానే ఫోన్ ద్వారా లైనింగ్ ఇచ్చి, మొదటి బంతి ప్రారంభం నుండి చివరి బంతి వరకు బెట్టింగ్ చేస్తారని తెలిపారు. ఇదంతా ఆటోమేటిక్ రికార్డ్ ద్వారా రికార్డు చేసి మ్యాచ్ ముగిశాక వారు పెట్టిన పందెం ఆధారంగా డబ్బులు నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేస్తున్నట్లు తమ విచారణలో తెలిందని పోలీసులు తెలిపారు.