దిశ, కంది : ప్రతి ఏటా భక్తులు ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ మహా శివరాత్రి. మార్చి 1వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలో ఘనంగా ఏర్పాట్లు ప్రారంభించారు. ఫసల్ వాది గ్రామ శివారులో గల జ్యోతి వాస్తు విద్యా పీఠం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభించారు. శివరాత్రికి ఒక రోజు ముందుగానే ఎంతో అద్భుతంగా 18 అడుగుల ఎత్తుతో పాత్ర లింగేశ్వరాన్ని స్థాపించారు. జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో శ్రీ పంచముఖ మహామేరు ఉమామహేశ్వర దేవాలయ నిర్మాణం జరుగుతోంది.
అయితే ఈ దేవాలయ ఆవరణలో పత్ర లింగేశ్వరాన్ని ఎంతో అద్భుతంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి వివిధ అడవుల నుంచి 226 రకాల ఔషధ చెట్ల ద్వారా సేకరించిన 18 కోట్ల మూలికా పత్రాలను ఒక చోట చేర్చి 18 అడుగుల ఎత్తులో ఈ పత్ర లింగేశ్వరాన్ని ప్రతిష్టించారు. సోమవారం ఉదయం సిద్ధాంతి మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ.. మంగళవారం మహా శివరాత్రి రోజున కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పత్రలింగేశ్వరాన్ని దర్శించుకుంటే పాపాలు హరిస్తాయని భక్తులకు సూచించారు. భక్తుల సందర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రశాంత్ కుమార్‌తో పాటు ఇతర పీఠం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.