పార్లమెంట్‌లో వాటిపై నిషేధం..
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ కీలక ఉత్తర్వులు జారీ చేశారు..Latest Telugu News
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ధర్నా, ప్రదర్శన, సమ్మె, నిరాహార దీక్ష, మతపరమైన వేడుకలు పార్లమెంట్ ఆవరణలో నిర్వహించకూడదని, దీనికి సభ్యులందరూ సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శలు చేశారు. 'విశ్వగురు మరో కొత్త ఆయుధం.. పార్లమెంట్‌లో ధర్నాలపై నిషేధం.' అంటూ మండిపడ్డారు. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా స్పందించారు. పార్లమెంట్‌లో ధర్నాలకు అనుమతి ఇవ్వబోమని జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. రేపు ఢిల్లీలో రాజకీయ నేతలు సమావేశం కానున్నట్లు తెలిపారు.
కాగా, జులై 18వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే లోక్‌సభ నిషేధిత పదాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సిగ్గుచేటు, అవినీతి పరుడు, డ్రామా, జుమ్లాజీవి, పిరికివాడు, చీకటి రోజులు, అహంకారి వంటి పదాలను వాడకూడదు. ఈ విషయంపై కూడా విపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పదాలను వాడటంలో తప్పేంముందని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. పార్లమెంట్ సభ్యుల గౌరవాన్ని కాపాడే విధంగా మాటలు ఉండాలన్నారు. అందుకే గతంలో వాడకూడని పదాలతో కూడిన బుక్‌లెట్ తీసుకొచ్చామన్నారు. 1959 నుంచే ఈ పద్ధతి కొనసాగుతోందని, ప్రస్తుతం వాటిని ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.