భారత్‌కు ధన్యవాదాలు తెలిపిన పాక్ మహిళా ఖైదీ
న్యూఢిల్లీ : శిక్ష పూర్తి చేసుకున్న ముగ్గురు పాకిస్తాన్ ఖైదీలను భారత్ ప్రభుత్వం విడుదల చేసింది..latest telugu news
న్యూఢిల్లీ : శిక్ష పూర్తి చేసుకున్న ముగ్గురు పాకిస్తాన్ ఖైదీలను భారత్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఒక మహిళతో పాటు ఆమె కూతురు కూడా ఉంది. ఈ విషయాన్ని ప్రోటోకాల్ పోలీస్ అధికారి అరుణ్ పాల్ శనివారం జాతీయ మీడియాకు వివరించాడు. విడుదలైన ఖైదీలను సమీరా, అహ్మద్ రాజా, ముర్తాజా అజ్గర్ అలీగా గుర్తించారు. అయితే, జైలు నుంచి విడుదలయ్యాక వీరిని అట్టారీ వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌కు భారత అధికారులు పంపించారు. ఆ సమయంలో మహిళా ఖైదీ సమీరా మాట్లాడుతూ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.
అంతేకాకుండా తమ లాగా ఇక్కడి జైళ్లల్లో మగ్గుతున్న పాక్ పౌరులందరినీ విడుదల చేయాలని భారత ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా బెంగళూరులో అనుమానాస్పదంగా తిరుగుతున్న సమీరాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పాక్ పౌరురాలిగా తేలింది. అప్పటికే ఆమె గర్భవతి. దేశంలో చొరబడ్డ నేరం కింద కోర్టు ఆమెకు మూడున్నరేళ్లు శిక్ష విధించింది. మిగతా ఇద్దరు ఖైదీలు బార్డర్ వద్ద సంచరిస్తుండగా వారిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. విచారణ అనంతరం కోర్టు వీరికి 21నెలలు శిక్ష విధించగా ప్రస్తుతం వీరు జైలు నుంచి విడుదలై స్వదేశానికి పయనమయ్యారు.