గిరిజన జానపదం 'నంచమ్మ'

దిశ, ఫీచర్స్ : 64 ఏళ్ల గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎన్నికైన ఒక రోజు తర్వాత, అట్టప్పాడిలోని నిరాడంబరమైన గిరిజన కుగ్రామానికి చెందిన జానపద గాయకురాలు నంచమ్మ 68వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డు అందుకోవడం విశేషం.

Update: 2022-07-23 13:58 GMT

దిశ, ఫీచర్స్ : 64 ఏళ్ల గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎన్నికైన ఒక రోజు తర్వాత, అట్టప్పాడిలోని నిరాడంబరమైన గిరిజన కుగ్రామానికి చెందిన జానపద గాయకురాలు నంచమ్మ 68వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డు అందుకోవడం విశేషం.

అట్టప్పాడిలో 1960లో జన్మించిన నంచమ్మ మేకల కాపరిగా జీవనం సాగించేది. జానపద గీతాలను ఎక్కువగా పాడే నంజమ్మ, తొలిసారిగా సింధు సజన్ దర్శకత్వం వహించిన 'అగ్గేడు నాయగా' అనే డాక్యుమెంటరీ కోసం పాడింది. నంజమ్మ కేరళ ప్రభుత్వ గృహనిర్మాణ కార్యక్రమం లైఫ్ మిషన్ కోసం ఓ ప్రచార గీతాన్ని కూడా ఆలపించింది. కేరళలో ప్రజా సంబంధాల కార్యక్రమానికి ఇరుల్ భాషను ఉపయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

గిరిజన కళాకారుడు పళని స్వామి నేతృత్వంలోని ఆజాద్ కళా సమితిలో 2004లో గాయనిగా చేరిన నంచమ్మ.. ఇందులో భాగంగా కేరళవ్యాప్తంగా జరిగే ప్రదర్శనల్లో ఎన్నో పాటలు పాడింది. అయితే ఆమెకు పళని స్వామి ద్వారే సచి(దివంగత) దర్శకత్వం వహించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్'(ఏకే) మూవీలో 'కలక్కథ' పాట పాడే అవకాశం వచ్చింది. అయ్యప్పనుమ్ కోషియుమ్‌లో అతిథి పాత్రలో నటించిన పళని స్వామితో సినిమాలో రెండు గిరిజన పాటలను చేర్చాలనుకుంటున్నట్లు దర్శకుడు తెలిపాడు. దీంతో తన ట్రూప్‌లో పాడే నంచమ్మ పేరు సచికి సజెస్ట్ చేయడం.. వాయిస్ టెస్ట్ కూడా ఓకే కావడంతో రెండు పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకుంది. 'కలక్కథ' ప్లేబ్యాక్ పాడిన తర్వాత ఆమె ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం టైటిల్ సాంగ్ ఇరుల్ భాషలో స్వయంగా నంజమ్మ రాయగా, జేక్స్ బిజోయ్ స్వరపరిచాడు. 'కలక్కథ' యూట్యూబ్‌లో విడుదలైన తర్వాత నెలలోనే 10 మిలియన్‌కు పైగా వీక్షణలను పొందింది. దీంతో ఆమె ఇతర చిత్రాల్లో అవకాశాలు అందుకోవడం సహా ముంబై, దుబాయ్‌లకు వెళ్లి పాటలు పాడి పలు పురస్కారాలు అందుకోవడం విశేషం.

'చిత్రంలో వచ్చే ఆ ప్రదేశం, అక్కడి వ్యక్తుల గురించి ఓ భావోద్వేగం కలిగేలా పాటలుండాలని సచి సార్ నాకు చెప్పారు. దీంతో 'కలక్కథ సందన మారం', 'దైవ మగలే' (దేవుని కుమార్తెలు) పాటలు రెండూ కూడా రాయడం సహా నేనే పాడాను. ఆ పాటలు పాడటం విన్నప్పుడు, సచి సార్ కళ్లు ఆనందంతో నిండిపోయాయి. ఈ పాట ఆయనతో పాటు ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రజల మనసుల్లో నిలిచిపోతుందని అప్పుడే చెప్పాడు. నిజంగా సచికి రుణపడి ఉంటాను, అవార్డు రావడం సంతోషంగా ఉంది' అని నంచమ్మ కృతజ్ఞతలు తెలిపారు.

'ప్రకృతిలో ఒక రిథమ్, మెలోడీ ఉందని సచి నాతో చెప్పాడు. జానపద పాటలు అట్టప్పాడి స్థానిక నివాసితుల సంస్కృతి, దినచర్య, పని, వేడుకలతో ముడిపడి ఉంటాయి. వారిని సినిమాలో చేర్చి, వారి సినిమా సామర్థ్యాన్ని అన్వేషించాలనుకుంటున్నాను' అని పళనిస్వామి గుర్తు చేసుకున్నారు.

Tags:    

Similar News