కేసీఆర్‌కు సూచనలిచ్చే ధైర్యం లేదు.. ఎంపీ కేశవరావు ఆసక్తికర వ్యాఖ్యలు

"ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచనలు, సలహాలు ఇచ్చే ధైర్యం నాకు లేదు. మెడికల్ చెకప్ కోసం వచ్చి వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నారు.

Update: 2022-04-09 16:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : "ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచనలు, సలహాలు ఇచ్చే ధైర్యం నాకు లేదు. మెడికల్ చెకప్ కోసం వచ్చి వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. వడ్ల కొనుగోళ్ళ విషయంలో ప్రధానమంత్రిని కలవొచ్చుగా.. అని చెప్పే ధైర్యం నాకు లేదు" అని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావు వ్యాఖ్యానించారు. ఢిల్లీ స్థాయిలో టీఆర్ఎస్ తలపెట్టిన నిరసన దీక్ష ఏర్పాట్లను పరిశీలించడానికి తెలంగాణ భవన్ ప్రాంగణానికి చేరుకున్న ఆయన అక్కడి మీడియాతో పై విధంగా వ్యాఖ్యానించారు. మెడికల్ చెకప్‌లో భాగంగా ఢిల్లీకి వచ్చారని, రెండు దంతాలను వైద్యులు తొలగించారని మీడియాకు వివరించారు. ప్రధానితో ఎందుకు భేటీ కాలేదని పాత్రికేయులు ప్రశ్నించగా, ఆరోగ్యం బాగలేనందువల్లనే కలవలేకపోయారని బదులిచ్చారు. దీనికి స్పందనగా, ప్రధానితో కలవడానికి ఆరోగ్యం బాగలేనప్పుడు ధర్నాలో ఎలా పాల్గొంటారని ఎదురు ప్రశ్నించారు. దీనికి కేశవరావు వివరణ ఇస్తూ, ప్రధానిని కలవాలని కేసీఆర్‌కు చెప్పేంత ధైర్యం తనకు లేదని సూటిగానే చెప్పారు.

నిరసన దీక్షలో కేసీఆర్ పాల్గొంటారా అని పాత్రికేయులు ప్రశ్నించగా, అవసరమైతే ధర్నాలో పాల్గొంటారని బదులిచ్చారు. పొలిటికల్ ఇష్యూలలో అప్పుడప్పుడూ కొన్ని సర్‌ప్రైజులు ఉండాలన్నారు. ధర్నాకు ఇంకా పేరు పెట్టలేదని, ఆదివారం దాని గురించి మీడియాకు వెల్లడిస్తామని, ముఖ్యమంత్రి పాల్గొనడంపై కూడా నిర్ణయం జరిగిన తర్వాత తెలియజేస్తామన్నారు. తెలంగాణలో యాసంగిలో పండే బియ్యాన్ని తీసుకోబోమని కేంద్రం చెప్తున్నదని, వాతావరణ పరిస్థితుల్లో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుంది తప్ప కేంద్రం కొనే ముడి బియ్యం రాదని వివరించారు. తెలంగాణ అధికారుల మెడ మీద కత్తి పెట్టి 'బాయిల్డ్ రైస్ పంపబోం' అని ఒప్పందం చేసుకున్నట్లు కేంద్రంపై విమర్శలు చేశారు.

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా రైతుల కష్టాలను చూపించడానికే తెలంగాణ భవన్ వేదికగా ధర్నా చేస్తున్నట్లు కేశవరావు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అక్కడి రైతులకు మద్దతుగా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ శ్రేణులకు ఉద్యమాలు కొత్తకాదని, రాష్ట్రాన్ని సాధించుకున్నదే ఉద్యమం ద్వారా అని వివరించారు.

Tags:    

Similar News