భారత్‌పై ఆ విశ్వాసం మాకుంది: రష్యా విదేశాంగ మంత్రి
ఢిల్లీ: కష్టకాలంలో కూడా భారత్, రష్యా సంబంధాలు నిలకడగానే కొనసాగాయని రష్యా విదేశాంగ మంత్రి.. Latest Telugu news..
ఢిల్లీ: కష్టకాలంలో కూడా భారత్, రష్యా సంబంధాలు నిలకడగానే కొనసాగాయని రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ పేర్కొన్నారు. తమ రెండు దేశాల మధ్య సహకారం ఇకపై కూడా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం కూడా తనకు లేదని చెప్పారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలోనూ భారత్ అనుసరిస్తున్న వైఖరి అభినందనీయమని వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం భారత్ సందర్శనకు విచ్చేసిన లవ్రోవ్ ప్రస్తుత సంక్షోభ సమయంలో కూడా భారత్ ఏకపక్ష ధోరణికి దూరంగా ఉందన్నారు.
భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనియాడారు. భారత్ వంటి గొప్ప దేశంతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రష్యా విదేశీ విధానంలో కీలక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. స్వావలంబన కలిగిన, సమతూకంతో కూడిన ప్రపంచంపై తమ రెండు దేశాలకు ఆసక్తి ఉందని చెప్పారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎలాంటి అర్థవంతమైన అంతర్జాతీయ చర్చనైనా సరే కుదించి వేయాలని ఈ రోజుల్లో మా పాశ్చాత్య మిత్రులు చూస్తున్నారు కానీ, ప్రస్తుత సమస్యను ఏకపక్షంగా కాకుండా అన్ని పార్శ్వాల నుంచి పరిశీలించి స్థిరమైన వైఖరిని ప్రదర్శిస్తున్న భారత్‌ని నిజంగానే అభినందిస్తున్నామని లవ్రోవ్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ సంక్షోభంలో ప్రధాని నరేంద్ర మోదీ మధ్యవర్తిత్వానికి అవకాశం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు భారత్ అలాంటి ప్రక్రియను బలపర్చగలదని లవ్రోవ్ చెప్పారు. భారత్ ఒక ముఖ్యమైన, చిత్తశుద్ధి కలిగిన దేశం. మా ఉమ్మడి భాగస్వామిగా అలాంటి పరిష్కారం విషయంలో భారత్ పాత్ర పోషించినట్లయితే, ఉక్రెయిన్ నుంచి రష్యాకు ఎలాంటి ముప్పూ లేకుండా చూసుకోవడమే మా లక్ష్యం కాబట్టి అలాంటి భద్రతా హామీని మేం కోరుతున్నాం.
కానీ పశ్చిమ దేశాలు మాత్రం ఈ విషయంలో తమ బాధ్యతను విమర్శిస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ చెప్పారు. అలాంటి ప్రక్రియను భారత్ బలపర్చగలదని మా విశ్వాసం అని చెప్పారు. రష్యా నుంచి ఏది కొనాలని భారత్ భావించినా దానిపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నామని, పరస్పర సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటామని లవ్రోవ్ చెప్పారు.