వాట్సాప్ గ్రూప్ లో సీఐ మెసేజ్ వైరల్.. ఎవరికి ఏ ఉద్దేశంతో పంపారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న

నిజామాబాద్ జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారానికి ఆబ్కారి శాఖ అధికారులే కొండంత అండగా ఉండి కాపాడుతున్నారనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ జిల్లాలో ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ సీఐ వాట్సప్‌లో పోస్ట్ చేసిన మెసేజ్ తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2024-11-24 18:28 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారానికి ఆబ్కారి శాఖ అధికారులే కొండంత అండగా ఉండి కాపాడుతున్నారనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ జిల్లాలో ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ సీఐ వాట్సప్‌లో పోస్ట్ చేసిన మెసేజ్ తీవ్ర కలకలం రేపుతోంది. ఎక్సైజ్ అధికారుల చిత్తశుద్ధిని, వారి నిజాయితీని నిలబెట్టి ప్రశ్నించేలా చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. బోధన్ ఎక్సైజ్ సీఐ పవన్ గౌడ్ ఆదివారం ఓ మెసేజ్‌ను గ్రూపులో పోస్ట్ చేశారు. అది ఒకరికి పంపాల్సిన మెసేజ్ ను పొరపాటున మీడియా గ్రూప్ లో పోస్ట్ చేసినట్లుగా అర్ధమవుతున్నప్పటికీ ఆ మెసేజ్‌లో ఉన్న అలర్ట్ బెల్ ఎవరికి పంపారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మీడియా గ్రూప్ లో సీఐ పవన్ గౌడ్ పోస్ట్ చేసిన మెసేజ్ పై ఒక్కసారిగా మీడియా ఫోకస్ చేయడంతో ఈ విషయం కాస్తా ఆయన వరకు చేరింది. వెంటనే తేరుకుని వాట్సప్‌లో తాను పంపిన మెసేజ్ ను డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంతకూ వాట్సప్ గ్రూపులో సీఐ పంపిన మెసేజ్‌లో ఏముందంటే.. "Alert belt shops and illegal toddy shops in that area.." అని ఉంది.

సీఐ ఎవరికి ఈ మెసేజ్ పంపాలనుకున్నాడో, ఏ ఉద్దేశంతో ఎవరిని అలర్ట్ చేద్దామని ఈ మెసేజ్‌ను హడావిడిగా పొరపాటున మీడియా గ్రూపులో పంపాడో అర్థం కాకుండా ఉంది. సీఐ అలర్ట్ చేయాలనుకున్నది ఎవరిని? ఏ విషయంలో అలర్ట్ చేయాలనుకున్నాడు? ఏదైనా బెల్ట్ షాపులు, ఇల్లీగల్ కల్లు దందాలపై రైడ్స్ ఏవైనా ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తే, ఆ విషయం డిపార్ట్ మెంట్ సీక్రెట్‌గా సీఐ కి తెలిస్తే అక్రమ మద్యం వ్యాపారులను రక్షించే క్రమంలో ఈ మెసేజ్ వారికి పంపాలనుకున్నారా? పొరపాటున ఆ మెసేజ్ మీడియా గ్రూప్ లో పోస్ట్ అయ్యిందా? అనేటటువంటి అనేక సందేహాలు, చిక్కు ముడి ప్రశ్నలాగే మిగిలిపోయాయి. కానీ, అక్రమ మద్యం వ్యాపారులను తన సొంత శాఖ ఉన్నతాధికారుల ఆకస్మిక దాడుల నుంచి రక్షించే క్రమంలోనే ఈ మెసేజ్ పోస్ట్ చేశాడని 99 శాతం ప్రజలు భావిస్తున్నారు. ఇదే నిజమైతే ఇంటి దొంగలే ఇలా డిపార్ట్‌మెంట్ రైడ్స్ సీక్రెట్స్‌ను అక్రమార్కులకు లీకులందిస్తే అక్రమ వ్యాపారుల ఆగడాలను అరికట్టేదెవరు? అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడేదెప్పుడు? ఈ విషయంపై సీఐ పవన్ గౌడ్ ను దిశ ఫోన్ లో వివరణ కోరగా, తాను మా కానిస్టేబుల్స్ కు మెసేజ్ పెట్టానని, అది పొరపాటున మీడియా గ్రూప్ లో పోస్ట్ కాగా, దీన్ని పెద్ద రాద్దాంతం చేస్తున్నారని వాపోయాడు.

మహారాష్ట్రలో ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కదా.. ఆ ఏరియాలో కానిస్టేబుల్స్ అలర్ట్‌గా ఉండాలంటూ మెసేస్ పెట్టానన్నారు. కానీ, మెసేజ్‌లో కానిస్టేబుల్స్‌ను అలర్ట్ చేసినట్లుగా కాకుండా బెల్ట్ షాపులు, ఇల్లీగల్ కల్లు దందా వ్యాపారులను అలర్ట్ చేస్తున్నట్లుగా ఉందని, ఏవైనా ఉన్నతాధికారుల ఆకస్మిక రైడ్‌ల గురించిన సమాచారాన్ని వారికి మీరు ముందుగానే లీక్ చేసినట్లుగా ఆ మెసేజ్ చూస్తే అర్థమవుతుందని అడగగా, అలాంటిదేం లేదని, ఇంగ్లీష్ సరిగా రాక అలా పెట్టి ఉంటానని సమాధానమిచ్చారు. ఏదైమైనా ఈ మెసేజ్ జనాల్లో ఎక్సైజ్ శాఖకు అంతంత మాత్రంగా ఉన్న పరువును పూర్తిగా గుల్ ఫారం సీసాలో ముంచేసింది. జనాల్లో ఆబ్కారీ శాఖను మరింత పలుచన చేసింది. సీఐ ఉద్దేశం సదుద్దేశమా? కాదా అన్నది పక్కన పెడితే ఎక్సైజ్ శాఖ నుంచే అక్రమ మద్యం వ్యాపారులకు లీకులందే వ్యవస్థ బలంగా పనిచేస్తోందనే విషయం పక్కాగా అర్థమవుతోందని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో, ఎలాంటి విచారణ చేపడతారో వేచి చూడాల్సి ఉంది.


Similar News