కొత్త తరహా మోసలకు పాల్పడుతున్న కేటుగాళ్ళు.. తలపై తుపాకి పెట్టి కోటి రూపాయలు డిమాండ్

మండల పరిధిలోని అదిబట్ల పోలీస్ స్టేషన్‌లో కొత్త తరహా మోసాలకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-11-24 18:37 GMT

దిశ, ఇబ్రహీంపట్నం: మండల పరిధిలోని అదిబట్ల పోలీస్ స్టేషన్‌లో కొత్త తరహా మోసాలకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా వాయిస్‌తో గత పది రోజుల నుండి ఫోన్ కాల్ చేసి కారు ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి అలాగే మాకు బొంగులూరులో ప్లాట్లు ఉన్నాయి, అమ్ముతామని పిలిపించుకొని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదిబట్ల సిఐ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం బోయవాడ కాలనీకి చెందిన రాచ నారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయనకు గత పదిరోజులుగా ఓ మొబైల్ ఫోన్ నుంచి మహిళ వాయిస్‌తో ఫోన్ చేసి మీ కారు ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పారు. అలాగే మాకు బొంగుళూరు లో ప్లాట్లు ఉన్నాయని.. వాటిని అమ్మి పెట్టాలని కోరారు. బొంగుళూరు వస్తే ప్లాట్లు చూపెడతామని నారాయణను బొంగులూరులోని మెట్రో సిటీ వెంచర్ వద్దకు రప్పించుకున్నారు.

నారాయణ తన డ్రైవర్ ముసిఫ్ ఖాన్‌తో కలిసి అక్కడికి వెళ్లాడు. వారు అక్కడ వేచి ఉండగా ఇంతలో నలుగురు వ్యక్తులు వచ్చి ముఖాలకు నల్లటి మాస్కులు కప్పి కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకు పోయారు. ఆ వ్యక్తులు ఇద్దరి మొబైల్ ఫోన్స్, కారు తాళం లాక్కున్నారు. 45 నిమిషాల తర్వాత వారిని ఒక గదిలో బందించి అక్కడ ఒక వ్యక్తి పోలీస్ యూనిఫాం లో ఉండి నారాయణ తలపై తుపాకీ పెట్టి వెంటనే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో నారాయణ తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో, ఆ నిందితులు 10 పేపర్ల పై సంతకాలు వేలిముద్రలు తీసుకున్నారు. తర్వాత ఆ నిందితులు వారికి మొబైల్ ఫోన్స్ కారు తాళాలు ఇవ్వడంతో పాటు వారిని ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్లారు. తమను కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురిచేసి సంతకాలు, వేలిముద్రలు తీసుకున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని నారాయణ అదిబట్ల పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు ప్రారంభించమని సీఐ తెలిపారు.


Similar News