బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి.. ఎమ్మెల్సీ కవితతో TBGKS నేతల భేటీ
దిశ, తాండూర్: కోల్ బెల్ట్ ప్రజా ప్రతినిధులు, టీబీజీకేఏస్ యూనియన్ నాయకులతో శుక్రవారం యూనియన్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సమావేశం నిర్వహించారు.
దిశ, తాండూర్: కోల్ బెల్ట్ ప్రజా ప్రతినిధులు, టీబీజీకేఏస్ యూనియన్ నాయకులతో శుక్రవారం యూనియన్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి కెంగర్ల మల్లయ్యకు టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామక పత్రం అందజేశారు. అంతకుముందు మంత్రి కొప్పుల ఈశ్వర్, కోల్ బెల్ట్ ఎంపీలు మాలోతు కవిత, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డిలతో కవిత సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, గుర్తింపు సంఘం ఎన్నికలు, కార్మికుల ప్రధాన సమస్యలపై చర్చించారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని నేతలకు ఆమె సూచించారు. ఇటీవల బొగ్గు గనిలో ప్రమాదవశాత్తు మరణించిన సింగరేణి అధికారులు, కార్మికులకు నివాళులు అర్పించారు. మంత్రి, కోల్‌బెల్ట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీబీజీకే ఎస్ నేతలతో ఎమ్మెల్సీ కవిత భేటీ కావడం కోల్ బెల్ట్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపొందించారని గుర్తు చేశారు. కరోనా సంక్షోభంలోనూ సింగరేణి కార్మికులకు 29% లాభాల వాటా చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న ఎమ్మెల్సీ కవిత, కార్మిక పక్షాన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి సంస్థను కాపాడుకుంటామని తెలిపారు.