కేసీఆర్ చేసిన అవినీతి బండి సంజయ్‌కి కనిపించడంలేదా..? : జీవన్‌రెడ్డి

దిశ, రామడుగు: కాళేశ్వరం మూడవ టీఎంసీ తరలింపు కోసం చేస్తున్న..MLC Jeevan Reddy hits out at Band Sanjay and CM KCR

Update: 2022-03-11 11:05 GMT

దిశ, రామడుగు: కాళేశ్వరం మూడవ టీఎంసీ తరలింపు కోసం చేస్తున్న భూ సేకరణ కమీషన్ల కోసమే అని, దానిని తక్షణమే నిలిపివేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని గంగాధర, బోయిన్ పల్లి, రామడుగు మండలాల రైతులు చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. ఇట్టి దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించి రైతుల దీక్షకు మద్దతు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాదని కాళేశ్వరం పేరిట కమీషన్ల కోసం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. అన్ని వేళలా రైతుల ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు. 20 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును పక్కనపెట్టి కమిషన్ కోసం 1.20 లక్షల కోట్లతో అంచనా వ్యయంతో ప్రాజెక్టులు చేపట్టారు. మేడిగడ్డలో 12 నెలల పాటు నీరు అందుబాటులో ఉంటే అదనపు టీఎంసీలు అవసరం ఏముందో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కేసీఆర్ ను అవినీతి కేసుల్లో జైల్లో పెడతామని తరచుగా మాట్లాడే బండి సంజయ్ కి కాళేశ్వరం పేరిట దోచుకున్న రూ. వేల కోట్ల అవినీతి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇట్టి అదనపు టీఎంసీ కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ జరుగుతుంటే బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని అన్నారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Tags:    

Similar News