జీఎం నిద్రపోతున్నాడా.. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం
దిశ, రామగిరి: ఆర్జీ-3 జీఎం నిద్రపోతున్నాడా..? గనిలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులకు కనీస సౌకర్యాలు కూడా సమకూర్చరా? అంటూ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సింగరేణి అధికాలులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, రామగిరి: ఆర్జీ-3 జీఎం నిద్రపోతున్నాడా..? గనిలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులకు కనీస సౌకర్యాలు కూడా సమకూర్చరా? అంటూ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సింగరేణి అధికాలులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఐఎన్ టీయూసీ, ఏఐటీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, వైవీరావు ఏఎల్పీ గనికి చేరుకున్నారు. మంథని ఎమ్మెల్యేతో తోట శ్రీకాంత్ కుటుంబ సభ్యులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వట్లేదని, వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శ్రీధర్ బాబు సింగరేణి అధికారులను నిలదీశారు. కార్మికుల కుటుంబ సభ్యులు వస్తే పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. వాహనం కూడా ఏర్పాటు చేయలేదని, తమ వాళ్ళు గనిలో చిక్కుకున్నారని తెలుసుకుని అల్లంత దూరం నుండి వస్తే పట్టించుకోవడం లేదని శ్రీధర్ బాబు మండిపడ్డారు.
సరైన సమాచారం ఇవ్వండి
అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో జరుగుతున్న సహాయక చర్యల గురించి కానీ, గని లోపల పరిస్థితి ఎలా ఉంది అన్న కనీసం సమాచారం ఇవ్వడం లేదని చైతన్య తేజ కుటుంబ సభ్యులు వాపోయారు. తమకు సరైన సమాచారం అందించే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారానో, ఎవరో చెప్తేనో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
మాకు న్యాయం చేయండి: తోట రాకేష్ (తోట శ్రీకాంత్ తమ్ముడు)
మాది పెద్దపల్లి దగ్గర చందపల్లి. మాది పేద కుటుంబం. మా నాన్న హార్ట్ పేషంట్, అమ్మకు ఆరోగ్యం బాగుండదు. మా అన్నయ్య జాబ్ చేద్దామని ఇక్కడకు వచ్చాడు. ట్రైనింగ్ పూర్తి అయ్యింది. సోమవారంతో వీటీసీ ఆన్ ది జాబ్ పూర్తి అయ్యేది. డ్యూటీ సమయం అయ్యాక బయల్దేరడాని, ఏదో వస్తువు కోసం తిరిగి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయమై అధికారులను అడిగితే ఎవరు స్పందించలేదు. మా అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియట్లేదు. మా బాగోగులు చూసుకునేవారు లేరు. మా అన్నయ్య ను కాపాడండి, మాకు న్యాయం చేయండి.